BRS MLCs | నాంపల్లి కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, తాతా మధు రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఇద్దరికీ చెరొక రూ.20,000 చొప్పున పూచికత్తుతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. కాగా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు (తాతా మధుసూదన్), ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాంపల్లిలోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. తాము స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తమను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశామని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెడుతుందని ఆరోపించారు.