Hyderabad | వెంగళరావునగర్, ఫిబ్రవరి 2 : వావివరుసలు మరిచి కూతురిపై లైంగికదాడికి తెగబడ్డాడు ఓ మారుతండ్రి. సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే ఈ దారుణం వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరిగింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కృష్ణారావుతో ఓ మహిళకు 2016లో రెండో వివాహమైంది. అప్పటికే ఆమెకు ఎదిగిన కూతురు, కుమారుడు ఉన్నప్పటికీ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. నిన్ను, నీ బిడ్డల్ని బాగా చూసుకుంటానని నమ్మించాడు. జీవితంలో తనకు ఓ తోడు కావాలనుకొని అతడిని పెళ్లాడింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో వేరుగా ఉంటున్నప్పటికీ.. మాట్లాడుకుంటూనే ఉన్నారు. పడుచు ప్రాయంలో ఉన్న ఆమె కూతురిపై కన్నేశాడు ఆ కామాంధుడు. హాట్ స్టార్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాలు ఉన్నాయని.. డైరెక్టర్‌ను ఓసారి కలువాలని కూతురుకు చెప్పి, ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఆమెకు ఫోన్ చేశాడు. సాయంత్రం ఆడిషన్స్ జరుగుతున్నాయి.. అమీర్‌పేట ఓయో లాడ్జీలో డైరెక్టర్ ఉన్నారని నమ్మించి.. ఆ యువతిని ఈనెల ఒకటో తేదీ సాయంత్రం తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లగా.. ఆ రూమ్‌లో డైరెక్టర్ ఎవరూ లేరు.
ఆడిషన్స్ లేవు. ఇంటికి వెళ్లిపోదామని యువతి చెప్పగా.. డైరెక్టర్ టీ తాగడానికి బయటకు వెళ్లారని.. కాసేపట్లో వచ్చేస్తారని చెప్పిన అతడు.. గది తలుపులకు గడియ బిగించాడు. వెంటనే నగ్నంగా మారుతండ్రి మారడాన్ని గమనించిన ఆ యువతి.. నాన్నా నా జీవితాన్ని పాడు చేయకు.. అని రోదించినప్పటికీ ఆ కఠినాత్ముడి మనస్సు కరగలేదు. బలవంతంగా యువతిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత బాత్రూమ్లోకి వెళ్లిన యువతి అక్కడి నుంచే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ చేసి ఏడుస్తూ తల్లితో జరిగిన దారుణం చెప్పింది. నిర్ఘాంతపోయిన ఆ మహిళ వెంటనే దివ్యాంగుడైన కుమారుడితో కలిసి ఓయో లాడ్జీలోని రూమ్‌కు పరుగున వెళ్లింది. కూతురి పరిస్థితి చూసిన ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది. లైంగికదాడికి పాల్పడ్డ అతడికి దేహశుద్ధి చేశారు. కుమారుడిని కొట్టి.. అతడి ప్లాస్టిక్ కాలును కృష్ణారావు విరగొట్టాడు. అంతేకాదు.. తనపై మహిళా, ఆమె కుమారుడు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణారావుపై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారంటూ కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళతో పాటు.. ఆమె కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికదాడికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.