నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే నిత్యం కృషి చేస్తున్నా. ప్రజల సాధక, బాధకాలను తెలుసుకొని మౌలిక వసతుల కల్పనకు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. స్థానికంగా విద్యా, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద మొత్తంలో దృష్టి సారించాం. ఆ దిశగానే గతమెన్నడూ ఎరగని అభివృద్ధిని సాధించాం. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ఆధారంగానే ప్రజలను ఓట్లు అడుగుతాం. మరోసారి టిక్కెట్ కేటాయించిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న మా పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా. అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ముషీరాబాద్ను మరింత పరుగులు పెట్టిస్తానని నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
సాధించిన ప్రగతే ప్రధాన ఎజెండా
నియోజకవర్గంలో వివిధ వర్గాలకు గత తొమ్మిదిన్నరేండ్లుగా అందిస్తున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధి, స్వరాష్ట్ర పాలనలో సాధించిన ప్రగతే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లనున్నట్లు ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించాం. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, పనితీరును గమనించిన సీఎం కేసీఆర్ తనకు మూడోసారి టికెట్ కేటాయించారు. మేము చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజల ముందరే ఉన్నవి. అవే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు మెజారిటీ తెచ్చిపెడుతాయి.
బీఆర్ఎస్ వెంటే ప్రజలు
తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి, మారిన పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు. ఒక నాడు కరెంటు కోతలు, నీళ్ల కరువు, రైతుల గోస నగర ప్రజలకు తెలుసు. సంక్షేమం, కరెంటు, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో సాధించిన విజయాలు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో కేసీఆర్కు, బీఆర్ఎస్కు విశేష ఆదరణ ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ వెంటనే ఉంటారు.
30 ఏండ్ల సమస్యలను పరిష్కరించా
మూడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను పరిష్కరించాం. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శనగర్, లలితానగర్, బండమైసమ్మనగర్, భోలక్పూర్, దాయరమార్కెట్ ప్రాంతాల్లో 30 ఏళ్లుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు పరిష్కారం చూపాను. నాలుగు దశాబ్దాలుగా ముంపునకు గురవుతున్న నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మకాలనీ సమస్యకు పరిష్కారం చూపాను. సీసీ రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్ దీపాలు, పార్కుల సుందరీకరణతో కాలనీలు, బస్తీల రూపురేఖలను మార్చేశాం. నాలాలను విస్తరించి వరద సమస్యలకు పరిష్కారం చూపాం.

సంక్షేమమే మా ప్రచారం
గత ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడంతోపాటు నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన జెండాగా ముందుకుసాతున్నా. నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల అత్యధికంగా 12వేల మందికి ఒకే సారి పెన్షన్లు అందించాం. పార్టీలు, కులమతాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీలకు అందిస్తున్న రుణాలు, ఉచిత తాగు నీరు వంటి పథకాలే మా ఎన్నికల ప్రచార అస్త్రాలు. కేసీఆర్ చరిస్మా, ప్రజల్లో ఉన్న అభిమానం, నిత్యం అందుబాటులో ఉండే తనకు ఉన్న ప్రజాదరణతో గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీ సాధిస్తాం.
స్టీలు బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్తున్న హుస్సేన్ సాగర్ నాలాకు ఇరువైపులా రక్షణ వలయం ఏర్పాటు చేశాం. జఠిలమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కారించడానికి రూ.450 కోట్లు వెచ్చించి స్టీలు బ్రిడ్జి నిర్మించాం. రూ.69 కోట్ల వ్యయంతో నాలా విస్తరణ, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం నిర్మాణం వంటి పనులు చేపట్టాం.