కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 13 : కూకట్పల్లి నల్లచెరువు వద్దనున్న అతి పురాతనమైన గ్రామదేవత.. పోచమ్మతల్లి ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి గ్రామం ఒకప్పుడు పచ్చని పంటపొలాలు, పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేదన్నారు. గ్రామదేవత పోచమ్మతల్లి కృపతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేవారని తెలిపారు. కాగా.. పురాతనమైన గ్రామదేవత పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈనెల 16న అమ్మవారి విగ్రహాన్ని పునుఃప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు.
ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కూకట్పల్లి గ్రామంలోని 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని అత్యద్భుతంగా పుననిర్మాణం చేసి వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గం పరిధిలోని పురాతన ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తూ భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సనాతన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రజలంతా కలిసిమెలిసి వేడుకల్లో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
శోభయాత్రలో మతసామరస్యం..
పోచమ్మతల్లి శోభాయాత్రలో మతసామరస్యం వెల్లువిరిసింది. కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అమ్మవారి శోభాయాత్ర వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కోలాటంతో నృత్యాలు, పాటలతో సందడి చేశారు. ఈ శోభాయాత్రలో ముస్లిం సోదరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.