బుధవారం 25 నవంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 07:42:41

బుల్లెట్‌పై నర్సన్న.. గల్లీగల్లీకి పర్యటన

బుల్లెట్‌పై నర్సన్న.. గల్లీగల్లీకి పర్యటన

కార్మికుల కష్టాలపై అనేక పోరాటాలు చేసిన కార్మిక పక్షపాతి. అన్నా అని పిలువగానే నేనున్నానంటూ వాలిపోయే పెద్దదిక్కు ఆయనే నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి హోంమంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవ చేసిన నాయిని ఇక లేరన్న వార్తను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. గురువారం నర్సన్న భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున అభిమానులు, గులాబీ శ్రేణులు తరలివచ్చి.. నివాళులర్పించారు. దారిపొడవునా అంతిమ యాత్ర జనసంద్రంగా మారింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాడెమోసి కన్నీటితో వీడ్కోలు పలికారు. జుబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో అంతిమ సంస్కరణలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. 

అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌ : కొవిడ్‌ను జయించి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి గోషామహల్‌ నియోజక వర్గంతో ఎంతో అనుబంధం ఉంది. తన సొంత గ్రామం నుంచి మొట్టమొదట నగరానికి చేరుకున్న నాయిని నర్సింహారెడ్డి సోషలిస్ట్‌ పార్టీలో పనిచేస్తూ గోషామహల్‌ నియోజకవర్గంలోని బేగంబజార్‌  నగరీ ఖానా ప్రాంతంలో నివాసముండే వారు. నాటి నుంచి కార్మికుల కష్టాల పరిష్కారం కోసం కృషి చేసేవారు. అంతే కాకుండా బేగంబజార్‌ హమాలీ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కార్మిక సంఘం, జనతా పార్టీ నాయకుడిగా ఆయన గోషామహల్‌ నియోజకవర్గం ప్రజలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. బుల్లెట్‌పై నియోజకవర్గంలోని బేగంబజార్‌ తదితర ప్రాంతాలలో పర్యటించి అందరితో కలగొలుపుగా ఉండేవారు. జనతా పార్టీ నుంచి ఆయనకు ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ లభించడంతో ఆయన తన నివాసాన్ని ముషీరాబాద్‌ నియోజకవర్గానికి మార్చుకున్నారు. ఇల్లు మార్చినప్పటికీ ఇక్కడి నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో గోషామహల్‌ నియోజకవర్గం ప్రజల మద్దతు కూడా ఆయనకు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి సారి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా అనేక సార్లు నియోజకవర్గంలో పర్యటించారు.టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఆర్‌.శంకర్‌లాల్‌ యాదవ్‌ ఆయనకు అనుంగు శిష్యుడిగా ఉండే వారు.

లంబాడి తాండకు డబుల్‌ ఇండ్లు.. నాయిని పుణ్యమే..! 

చిక్కడపల్లి : రాంనగర్‌ డివిజన్‌ బాగ్‌లిగంపల్లిలోని లంబాడీ తాండ బస్తీలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. నాయిని పేదల పక్షపాతి అనడానికి లంబాడీ తాండ బస్తీయే నిదర్శనం. లంబాడీ బస్తీలో సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించాలని అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డిని లంబాడీ తాండ వాసులు కలిశారు. వెంటనే స్పందించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో పనులు ప్రారంభంకాగా.. ప్రస్తుతం 90 శాతం వరకు పూర్తయ్యాయి.