సీసీ కెమెరాలు లేకుంటే కేసుల దర్యాప్తు ముందుకు కదలడం లేదు. అంబర్‌పేటలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడటం లేదు. నెల రోజులైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదు. హైదరాబాద్‌లో ఇలాంటి డబుల్ మర్డర్ కేసుల దర్యాప్తులను తేల్చడంలో గతంలో ఎప్పుడు కూడా ఇంత ఆలస్యం జరుగలేదనే టాక్ నగర పోలీస్ విభాగంలో నడుస్తున్నది.
కేవలం సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ ఆధారంగానే కేసుల దర్యాప్తునకు పోలీసులు అలవాటు పడటంతోనే ఈ తడబాటు జరుగుతున్నదనే చర్చ సైతం జరుగుతున్నది. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులైన లింగారెడ్డి, ఊర్మిళదేవిని గత నెల 19న గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వృద్ధ దంపతుల హత్య జరిగి నెల రోజులైనా ఇప్పటివరకు పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు.
-సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
హత్య ఘటనపై పోలీసులు ముందుగా దోపిడీ, దొంగతనం కోణంలో దర్యాప్తు జరిపారు. ఇంట్లో ఎవరు ఉండరు, ఇద్దరే వృద్ధులు ఉండడంతో వారి వద్ద ఉన్న నగదు, ఆభరణాలు దోచేయాలనే ప్లాన్‌తో జరిగిందని అనుమానించారు. అయితే ఇంట్లో బీరువాల్లో దాచిన సొమ్ము పోలేదు. అయితే వృద్ధురాలి చేతికి బంగారు గాజులు, పుస్తెలతాడు లేదని పోలీసులు గుర్తించారు.
దోపిడీ.. దొంగతనమే లక్ష్యంగా ఆగంతకులు వస్తే ఇంట్లో ఉన్నవాటిని కూడా దోచేయాలి.. అలా జరగకపోవడంతో పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇలా చేసి ఉంటారనే అనుమానంతో ఆ కోణాన్ని పోలీసులు పక్కన పెట్టారు. ఇతరులతో ఎవరెవరితోనైనా ఆర్థికపరమైన తగదాలు, ఇతరాత్ర ఆస్తుల తగాదాలున్నాయనే కోణంలోనూ ఆరా తీశారు. వృద్ధ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉండగా, అందులో ఇద్దరు విదేశాల్లో నివసిస్తున్నారు. మరో కూతురు కొంపల్లిలో ఉంటున్నారు. ఘటన జరిగిన తరువాత కేసులో పురోగతి అంతగా కనిపించకపోవడంతో ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. ఈ కేసు దర్యాప్తులో అంబర్‌పేట పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ బృందాలు పాల్గొంటున్నాయి.
ఘటన జరిగిన ఇంటికి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆధారాలు చిక్క లేదు. దీంతో కేసు దర్యాప్తు ప్రత్యేక బృందాలను నియమించిన ముందుకు సాగడం లేదు. నగర పోలీసులు మొదటి సారిగా ఇలాంటి కేసుల్లో వెనకబడిపోయారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసుల గతంలోగా వేగంగా పనిచేయడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. వృద్ధ దంపతుల గురించి బాగా తెలిసిన వారే హత్య చేసి ఉండడం కాని, హత్య చేయించి ఉండడం కాని జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఆ దిశగా ఆధారాలను సేకరించలేకపోతున్నారు. ఆ ఇంటికి వచ్చిపోయే రూట్లోని సీసీ కెమెరాలను సైతం విశ్లేషించిన పోలీసులకు అనుకున్న మేర ఆధారాలు లభించలేదు. ప్రస్తుతం పోలీసులు పూర్తిగా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌పైనే ఆధారపడడంతో ఇతర కోణాల్లో దర్యాప్తు చేయలేకపోతున్నారనే వాదన నడుస్తున్నది. సీసీ కెమెరాల్లో నిందితుడు ఎక్కడో ఓ చోట కనిపిస్తాడు. సెల్ఫోన్లో ఎప్పుడో ఓ సారి మాట్లాడి ఉంటాడు.. ఆ సెల్ఫోన్లో ఉన్న నంబర్లు, కాల్ హిస్టరీ ఆధారంగా కూడా దర్యాప్తు చేసినా.. అనుకున్న ఆధారాలు లభించలేదని తెలుస్తున్నది.
అంబర్‌పేట పోలీసులు మాత్రం ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, కుటుంబసభ్యులకు మధ్య తగాదాలకు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ తాము ఛేదించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నెల రోజుల నుంచి పోలీసులు త్వరలోనే కేసు ఛేదిస్తున్నామని చెబుతూ వస్తున్నారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా..? అలాగే ఆధారాలు లేని కేసుగా వదిలేస్తారా వేచి చూడాలి.