KTR | సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. ఆలయంపై దాడి తీవ్రకలకలం రేపుతోందన్నారు. ఇలాంటి తెలివితక్కువ చర్యలు హైదరాబాద్ నగర సహనశీలతకు మచ్చను తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొద్ది నెలలుగా రోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయన్నారు. దీనికే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. కుమ్మరిగూడలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఆదివారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాదారు. స్థానికుల దాడిలో గాయపడ్డ నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి స్పృహలో లేడని.. స్పృహలోకి వస్తేనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. దాడి ఘటన అనంతరం హిందూ సంఘాలు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆలయంలో విగ్రహం ధ్వంసం గురించి సమాచారం అందుకున్న స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే, ఓ వ్యక్తి ఆలయం గేట్‌ని కాలుతో తన్ని లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.