చిక్కడపల్లి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎం.ఎల్.సి. ఎన్నికలలో, గెలిచే బీసీ అభ్యర్థులకు కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులకు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సూటిగా ప్రశ్నించారు.
మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలోతెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, గంగపుత్ర విద్యావంతుల వేదిక సంయుక్తంగా నిర్వహించింది స్వర్గీయ ఎ.ఎల్. మల్లయ్య వర్ధంతి సభ జరిగింది. కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్రొ కె.మురళీ మనోహర్‌లు పాల్గొని, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని . సమన్వయకర్తలుగా ఆయా సంఘాల అధ్యక్షులు గడప శ్రీహరి, ప్రొ సుదర్శన్‌రావు వ్యవహరించారు.
ఆచార్య ఎం.బాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘”’తెలంగాణలో ఆర్థిక, సామాజిక, కులసర్వే – బీసీలపై ప్రభావం”” అనే అంశంపై వకుళాభరణం ప్రసంగిస్తూ… రాష్ట్రంలో నిర్వహించిన కులసర్వేలో ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించ లేదని ఆయన పేర్కొన్నారు. కులసర్వేకు సంబంధించిన ప్రశ్నావళిలో కూడా అనవసరమైన వివరాలు అడగడం మూలంగా ప్రజలు వివరాలు ఇవ్వడానికి తిరస్కరించడంతో కులసర్వే సంపూర్ణంగా పూర్తి కాలేదని అన్నారు. ఇందుకు బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ఆయన ప్రశ్నించారు. గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఏమి చేసారు? అని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిబద్ధతగా అవలంబిస్తున్న పద్ధతులేవీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆచార్య కె.మురళీ మనోహర్ మాట్లాడుతూ బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు సాధికారికంగా ప్రశ్నించడానికి విద్యావంతులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎల్.మల్లయ్య అభిమానులు, వివిధ బిసి కులసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.