V srinivas goud | ఖైరతాబాద్, జూలై 10 : కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కల్లు తాగిన 24, 48 గంటల తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఎలాంటి రసాయనాలు కలిపారు. ఎంత మోతాదులో కలిపారు. ఎవరు కలిపారు ఎవరైనా కావాలని కలిపారా? అనే అన్ని కోణాలలో పూర్తిగా విశ్లేషించి, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కల్లు వృత్తిని పూర్తిగా మూసివేసే విధంగా ఎవరైనా ఈ వృత్తిపై కుట్ర చేస్తున్నారా? అనేకోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కల్తీకి తావు లేకుండా..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎవ్వరిని విస్మరించకూడదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గత బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో కల్తీకి తావు లేకుండా గీత వృత్తిని కాపాడడం కొరకు ప్రతి గ్రామంలో సుమారు 1 కోటి 25 లక్షల ఈత, తాటి చెట్లను ఎక్సైజ్ శాఖ, అటవీశాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించుకుని నాటారని గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రతి గ్రామానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి, డ్రిప్‌ను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మూడు సంవత్సరాలలో కల్లు తీయడానికి చెట్లు అందుబాటులోకి వస్తాయని, చెట్లు ఎక్కువ అందుబాటులో ఉన్నప్పుడు ఎలాంటి కల్తీకి ఆస్కారం ఉండదన్నారు. మనం వాడే నిత్యావసర వస్తువులు కూడా ప్రస్తుతం మార్కెట్లో కల్తీగా మారాయని, పసిపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి రోజు తాగే పాలను యూరియాతో కల్తీ చేసి తయారు చేస్తున్నారన్నారు.
మన రాష్ట్రంలో ఆవులు, గేదెల నుండి ఒక రోజుకు 20 లక్షల లీటర్ల పాలు వస్తుంటే, మార్కెట్లోకి కల్తీ అయిన పాలతో సుమారు 40 లక్షల లీటర్లు సరఫరా అవుతున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలన్నారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్