Operation Musi | రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రెక్కల కష్టాన్ని నమ్ముకునే జీవులు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ భూస్థాపితం చేసింది. అలా ఇండ్లు కోల్పోయి డబుల్ బెడ్రూంల్లోకి బలవంతంగా వచ్చిన కుటుంబాలు 262. అయితే వారికి ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు ఖాళీ చేసిన వారికి రూ.25వేల పారితోషికం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న రూ.25వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ సాయం అందించలేదు.
అకస్మాత్తుగా రోడ్డున పడిన వారి బతుకులకు ఏదో ఒక రకంగా ఉపయోగపడే ఆ డబ్బులు ఇప్పటికీ అందలేదు. సాయం ఎప్పుడిస్తారు సారూ అని అధికారులను అడిగితే.. పండుగ తర్వాత ఇస్తామని చెబుతున్నారని బాధితులు అంటున్నారు. అయితే దసరా పండుగ ముందు కూడా ఇలానే అధికారులు సమాధానమిచ్చారని వాపోతున్నారు. ఇప్పుడు దీపావళి అనంతరం ఇస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కోల్పోయి రోదనలో ఉన్న వారికి తక్షణం సాంత్వన చేకూర్చాల్సిన ప్రభుత్వం వారిని మరింత ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నదని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
-సిటీబ్యూరో
ప్రజాభవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మూసీ రిహాబిలిటేషన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే లబ్ధిదారులను ఎంపిక చేసిన రెవెన్యూ అధికారులకు ఈ కార్యక్రమంపై సమాచారం లేకపోవడం గమనార్హం. రూ. 2 లక్షల చెక్కును మహిళా పొదుపు సంఘం నుంచి ఇప్పిస్తారని కొందరు అధికారులు చెబుతుండగా.. రూ.25వేల సాయం అయుండొచ్చని మరికొందరు అధికారులు చర్చించుకుంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే చెక్కుల పంపిణీ విషయం లబ్ధిదారులకు కూడా తెలియకపోవడం విస్మయం కలిగిస్తున్నదని మరికొందరు చర్చించుకుంటున్నారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పినా.. ఇప్పటికీ ఆ సాయం ఎలా అందుతుందో కూడా లబ్ధిదారులకు సమాచారం లేదు.
మూసీ పరీవాహక ఇండ్లు కూల్చడం తప్పదనే సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో ప్రకటిస్తునే ఉన్నారు. దీంతో నిర్వాసితులు భయాందోళనలో ఉన్నారు. తమ ఇండ్లపై వేలాడుతున్న రెడ్ మార్క్ ఆర్బీ-ఎక్స్ కత్తిని చూస్త్తే నిద్ర కూడా పట్టడం లేదని బాధితులు చెప్తున్నారు. ఇప్పటికే కూల్చేసిన వారికి సాయం అందలేదు. ఉమ్మడి కుటుంబాలను తీసుకెళ్లి ఒకే డబుల్ బెడ్రూంలో పడేశారు. వారంతా ఎలా బతకాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇండ్లు కోల్పోతే తాము కూడా కష్టాలు పడాల్సిందేనా అంటూ నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.