ఖైరతాబాద్, జూన్ 17 : మూసీ రివర్ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సందిస్తే.. నేరుగా సమాధానం చెప్పకుండా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటడ్ (ఎంఆర్డీసీఎల్)తో వివరణ ఇప్పించడమేంటని మూసీ జన ఆందోళన్ సమావేశంలో వక్తలు ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీ జన ఆందోళన్ ప్రతినిధి సజయ మాట్లాడుతూ.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల అనేక మంది నిర్వాసితులవుతున్నారని, ఇదే విషయమై తాము సూటిగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందిస్తూ వివరణ అడిగామన్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమను చర్చకు పిలిచి తమ అభిప్రాయాలు విన్నారని.. అయితే ఆయన నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదన్నారు.
ప్రజాభిప్రాయం సేకరణ కోసమే కేబినెట్ సబ్ కమిటీని వేశామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఏప్రిల్ 14న మూసీ జన ఆందోళన్ నుంచి వివరణాత్మక రిపోర్టును అందజేశామని, దానికి సమాధానం ఈనెల 9న వచ్చిందన్నారు. అయితే అది ప్రభుత్వం, సబ్ కమిటీ నుంచి రావాల్సి ఉండగా.. ఎంఆర్డీసీఎల్ నుంచి వచ్చిందని, పైగా తాము అడగని అనేక విషయాలను అందులో ప్రస్తావించారని, తాము అడిగిన ప్రశ్నలకు ఎలాంటి జవాబులు ప్రత్యుత్తరంలో లేదన్నారు. ఆ వివరణను తాము తిరస్కరిస్తున్నామన్నారు. దాదాపు 3వేల ఎకరాలను సేకరించడంతో పాటు 10 వేల కట్టడాలను కూల్చివేస్తూ చేపడుతున్న మూసీ ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని సజయ ఆరోపించారు.
మూసీ జన ఆందోళన్ ప్రతినిధి మీరా సంఘ మిత్ర మాట్లాడుతూ.. మార్చి 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివర్ ఫ్రంట్‌పై సమావేశం పెట్టి ప్రజల ప్రాజెక్టు అని చెప్పి ఆ కార్యక్రమంలో ప్రజలను దూరం పెట్టారన్నారు. మార్చి 27న ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేసిన ప్రభుత్వం దాని ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించలేదన్నారు. ప్రజాధనం ఖర్చుపెడుతున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా కర్మాగారాలు, రసాయనాలను ట్రీట్ చేయాలని, దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు ఉండాలని, కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించలేదన్నారు.
ప్రాజెక్టు కోసం నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీని రూ.3వేల కోట్ల వరకు ప్రభుత్వం అడిగిందని, అంతేకాకుండా ప్రజలను నిర్వాసితులను చేస్తూ ప్రాజెక్టు కడుతున్నప్పుడు దానికి సంబంధించిన డీపీఆర్‌లు, మ్యాప్, పర్యావరణానికి సంబంధించిన పత్రాలు, ప్లాన్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, కాని ప్రభుత్వం వాటిని పొందుపర్చకపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నేరుగా పనులు ప్రారంభిస్తామంటూ ప్రకటించిందని, ఈ వ్యవహారంలో జవాబుదారీతనం లేదన్నారు. దీనిని మూసి జన ఆందోళన్ తప్పకుండా ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక ప్రతినిధి బిలాల్, పీవోడబ్ల్యు ఝాన్సీ, సామాజిక కార్యకర్త వర్గీస్ థేక్నాథ్, అగ్రికల్చరల్ సైంటిస్ట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.