మా భూములు ఇవ్వం.. ఇండ్లను కూ ల్చొద్దు అంటూ మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరిట పేద, మధ్య తరగతి ప్రజల గూడు చెరిపేస్తున్న రేవంత్ సర్కారు తీరుపై జనం రగిలిపోతున్నారు. రాజేంద్రనగర్ మండలంలోని పలు ప్రాంతాలవారితో అధికారులు నిర్వహించిన అభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఏకపక్ష నిర్ణయాలను స్వాగతించలేమని, ఏండ్లుగా కట్టుకుని జీవిస్తున్న ఇండ్లను ప్రాజెక్టు కోసం కూల్చుతామంటే ఎలా ఒప్పుకోవాలని బాధితులు ప్రశ్నించారు. మూసీ బాధితుల ఆవేదనను ఆలకించాల్సిందిపోయి, చట్టం పేరుతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని తన క్యాబిన్‌కు పిలుసుకొని అభిప్రాయాలను నమోదు చేయడంపై బాధితులు మండిపడ్డారు.
-సిటీబ్యూరో
ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలోనే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 15(2) కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సాదాసీదాగా తెలిపారు. కానీ దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్లాలని జనం ప్రశ్నిస్తుంటే.. అధికారుల వద్ద సమాధానం కరువైంది. భూమికి భూమి ఇవ్వాలని, మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తుంటే.. చట్టం ప్రకారం చూస్తాం అంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న సర్కారు తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అధికారులు నిర్వహించిన ఈ అభిప్రాయ సేకరణ కూడా కంటి తుడుపు చర్యగానే పరిగణిస్తున్నారు. నిబంధనల కోసమే అధికారులు ఈ సమావేశం నిర్వహించారు తప్పా… బాధితులకు న్యాయం చేసే ఉద్దేశం అధికారులకు గానీ, ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. మంచి రేటుతో పరిహారం ఇస్తామని చెబుతున్నా.. తాము నమ్మే పరిస్థితిలో లేమని, అందుకే భూములు ఇచ్చేది లేదంటున్నామని కొందరు బాధితులు వివరించారు. అభ్యంతరాలను కలెక్టర్‌కు పంపిస్తారే తప్పా..తమకు ప్రయోజనమే లేదంటున్నారు.
ముందుచూపు లేని ప్రాజెక్టు..
మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ సర్కారును నమ్మే స్థితిలో జనాలు లేరు. ఈ ప్రాజెక్టు తెర మీదకు వచ్చిన నాటి నుంచి మూసీ పేరిట జరిగిన కూల్చివేతల విధ్వంసం, నోటీసులతో బాధితులపై జరిగిన బెదిరింపులు, పరీవాహక ప్రాంతంలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వరకు అన్నింటి విషయాలతో జనాలు నమ్మే పరిస్థితి లేకుండాపోయింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాటల్లో స్పష్టత లేకపోవడం, వారి మాటల వెనుక పేదల ఇండ్లను కూల్చే కుట్రలే దాగున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఒకవైపు ఇళ్లు కోల్పోతామనే భయం, మరోవైపు సరైన పరిహారం పేరిట అధికారుల ప్రలోభాలతో అయోమయంలో ఉన్నారు. మొత్తంగా మూసీ తీరం వెంబడి ఉన్న పరీవాహక జనాలను రేవంత్ సర్కారు పెడుతున్న ఇబ్బందులపై జనాలు నిప్పులు చెరుగుతున్నారు. అధికారులు ఇప్పటికైనా మొక్కుబడి సమావేశాలను నిర్వహించడం కంటే, బాధితులకు న్యాయం జరిగే చర్చలు, సమావేశాలు నిర్వహించాలని సూచిస్తున్నారు.