మణికొండ, సెప్టెంబర్ 30ః యువత నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనుకుంటే… దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా సాగుతుండడంపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు, దారి దోపిడీ ఘటనలు మరవకముందే మరో దారుణమైన సంఘటన మంగళవారం తెల్లవారు జామున వెలుగుచూసింది.
వివరాలల్లోకి వెళ్తే.. నార్సింగి మున్సిపాలిటీ కోకాపేట-నార్సింగి సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న యాదగిరి, అప్రోజ్, నవాజ్ ముగ్గురు స్నేహితులు. వీరంతా వేర్వురు ప్రాంతాల నుంచి ఇక్కడ కేటాయించిన ఇళ్లలో నివాసముంటున్నారు. కాగా నార్సింగికి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి విలువైన సెల్‌ఫోన్‌ను సోమవారం దొంగిలించారు.
అక్కడి నుంచి నేరుగా కోకాపేటలోని డబుల్‌బెడ్‌రూమ్‌ల వద్దకు వచ్చారు. దొంగిలించిన ఫోన్‌ను విక్రయించి డబ్బులు పంచుకోవాలని చర్చించుకున్నారు. అయితే సెల్ ఫోన్ దొంగిలించడం మంచికాదని… ఆ ఫోన్ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుంటారని.. ఎక్కడైతే దొంగిలించామో అక్కడే ఇచ్చేసి వద్దామని యాదగిరి చెప్పగా అప్రోజ్, నవాజ్‌లు వ్యతిరేకించారు. ఎవ్వరూ కొనుగోలు చేయరని, బయట తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పినా వారు వినలేదు.
ఆ తర్వాత ముగ్గురూ కలిసి పక్కనే ఉన్న నిర్మాణుష్య ప్రాంతంలోకి వెళ్లి పీకలదాక మద్యం సేవించారు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తులతో అప్రోజ్, నవాజ్‌లు విచక్షణారహితంగా యాదగిరిని పొడిచి దారుణంగా చంపేశారు. ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి చేరుకున్న యువకుల కదలికలపై కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వారిని పట్టుకుని ప్రశ్నిస్తే యాదగిరి అక్కడ చనిపోయి పడి ఉన్నాడంటూ బుకాయించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా విఘతజీవిగా యాదగిరి పడి ఉన్నాడు. ఇదంతా ఎలా జరిగిందని ఎంత అడిగినా అప్రోజ్, నవాజ్‌లు చెప్పలేరు. దీంతో వందకు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నార్సింగి పోలీసులు అక్కడకు వచ్చి యాదగిరి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు యువకులను నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా తామే సెల్ విషయంలో గొడవపడి హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.