దుండిగల్, నవంబర్ 9: దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ స్వాతి కేసు మిస్టరీ వీడింది. తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతోపాటు లేకుంటే తనతో గడిపిన న్యూడ్ వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించడంతో ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బోయ కిషన్ అనే వ్యక్తి బంధువులతో కలిసి, పథకం ప్రకారం స్వాతిని హతమార్చినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతోపాటు వారి నుండి ఐ10 కారు, మూడు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ ఏసీపీ శంకర్‌రెడ్డి ఆదివారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి(27) భర్త రమేశ్‌తో విభేదాలు తలెత్తడంతో ఏడాదిన్నర కాలంగా కొడుకులను తీసుకుని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఫ్లాట్‌లో కిరాయికి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి యజమాని, కూకట్పల్లి పరిధి, ఎల్లమ్మబండకు చెందిన రియల్ ఎస్టేల్ వ్యాపారి కిషన్(43)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈనేపథ్యంలో తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని కిషన్‌పై స్వాతి ఒత్తిడి పెంచింది. లేనిపక్షంలో తనతో గడిపిన న్యూడ్ వీడియోలను బయటపెడుతానని బెదిరించింది. అప్పటికే ఇరువురి మధ్య ఉన్న సంబంధం కిషన్ ఇంట్లో తెలియడంతో గొడవలు జరుగుతుండగా, ఎలాగైన స్వాతి అడ్డు తొలగించుకోవాలని తన మేనల్లుడు, జగద్గిరిగుట్టలో స్ట్రీట్‌ఫుడ్ వ్యాపారి బోయ రాజేశ్(26)తో కలిసి కిషన్ పథకం రచించాడు. తన చేతికి మట్టి అంటకుండా జరగాలని సూచించాడు. ఇందుకు అంగీకరించిన రాజేశ్ తన వద్ద పనిచేసే నదీన్దొడ్డి వంశీ(24)తో కలిసి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బహదూర్‌పల్లి, గ్రీన్‌హిల్స్ కాలనీలోని స్వాతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి ఆమె గొంతుకోసి పరారయ్యారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం భౌరంపేట్‌లోని కేఎల్‌హెచ్ యూనివర్సిటీ వద్ద కారులో వెళ్తుండగా రాజేశ్, వంశీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎల్లమ్మబండలోని తన నివాసంలో బోయ కిషన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితులను ఆదివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుండి ఐ10 కారు, కత్తితోపాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో బోయ కిషన్ భార్యతోపాటు ఇతర కుటుంబసభ్యుల ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుల్లో బోయ కిషన్, రాజేశ్‌ల స్వస్థలం ఏపీలోని కర్నూల్ కాగా, 30 ఏండ్ల క్రితమే ఎల్లమ్మబండలో స్థిరపడ్డారు. మరో నిందితుడు వంశీ సంగారెడ్డి జిల్లాకు చెందినవాడని ఏసీపీ తెలిపారు. కిషన్‌పై వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 8కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈసమావేశంలో దుండిగల్ సీఐ సతీష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాల్‌రెడ్డి, ఎస్ఐలు రామ్మోహన్‌రెడ్డి, సరళ సిబ్బంది పాల్గొన్నారు.