సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ల్యాండ్ సెటిల్ మెంట్లలో రౌడీషీటర్లు కీలకంగా వ్యవహారిస్తున్నారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా తగ్గిపోవడంతో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌తోపాటు శివారులలో భూముల ధరలు రూ.కోట్లు పలుకుతుండడంతో కొడితే జాక్‌పాట్ కొట్టాలని అడ్డదారులు తొక్కుతున్నారు. వివాదాస్పదమైన భూములను పరిష్కరిస్తే రూ.కోట్లు వస్తాయని వాటిని సెటిల్ చేసేందుకు వివాదాల్లో తలదూరుస్తున్నారు.
తమ సమస్యను పరిష్కరించాలంటూ ఆయా పార్టీలు కొన్ని సందర్భాలలో రౌడీషీటర్లను ఆశ్రయిస్తుండగా, మరికొందరు నేరుగా వివాదాల్లోకి ఎంటరై బెదిరిస్తూ సెటిల్ చేస్తున్న ఘటనలున్నాయి. రౌడీషీట్ నమోదై ఉండడం, గతంలో హత్యలు, దోపిడీ దొంగతనాల కేసులలో నిందితులుగా ఉండగా… ఆ నేరాలే తమ డిగ్రీలుగా చెప్పుకుంటూ దాదాగిరి చేస్తున్న వాళ్లు ఉన్నారు. సమాజంలో ఇలాంటి వాళ్లంటే ప్రజలలో భయం ఉంటుంది… ‘అరే గతంలో హత్య చేశాడు.. చెప్పినట్లు వినకపోతే ఎంతకైనా తెగిస్తాడు’ అనే భయాన్ని తమ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇలాంటి వాళ్ల దగ్గరకు వివాదాస్పదమైన భూములకు సంబంధించిన పైరవీలు తీసుకొచ్చేందుకు చోటామోట నేరస్తులు కూడా భాగస్వాములు అవుతున్నారనే సమాచారం ఉంది. ఇటీవల కుషాయిగూడలో నడిరోడ్డుపై రియల్టర్ శ్రీకాంత్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఓ నిందితుడిపై రౌడీషీట్ ఉంది. గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో పలు వివాదాలలో ఇతనిపై కేసులు ఉండడంతో తన రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ భూ దందాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హైదరాబాద్‌లో రౌడీషీట్ నమోదై ఉండడంతో స్థానికంగా బుద్దిమంతుడిగా వ్యవహరిస్తూ శివారు ప్రాంతాలలో సెటిల్మెంట్లు చేస్తూ భూ వివాదాలు పరిష్కారంలో రియల్టర్లతో చేతులు కలిపాడు.
రౌడీషీటర్లు ఏమి చేస్తున్నారు, వాళ్ల రోజు వారి వ్యవహారాలపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిఘా కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. కొంత మంది రౌడీషీటర్లు తమపై ఉన్న రౌడీషీట్‌ను తొలగించుకోవడం కోసం సత్ప్రవర్తనతో మెలుగుతున్న వాళ్లు ఉన్నారు. అయితే అదే రౌడీషీట్‌ను ఉపయోగించుకొని ఆర్ధికంగా ఎదగాలని, అవసరమైన నేరాలు చేయాలనే ఆలోచనతో ఉన్నవారు చాలామంది ఉంటున్నారు. రౌడీషీటర్లే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల కోసం ప్రత్యేక గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
కొందరు రౌడీషీటర్లకు పోలీసులతోను సత్సంబంధాలున్నాయని చెప్పుకుంటూ తమతో కాకుండా తమకు తెలిసిన అధికారుల ద్వారా చెప్పించుకొని సమస్య పరిష్కరిస్తామంటూ చెప్పుకుంటున్న వాళ్లు ఉన్నారు. రౌడీషీటర్లు దేనికైనా తెగిస్తారని వివాదంలోకి వాళ్లు వచ్చారంటే భయంతోనే చాలామంది సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.
ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రనిధులతోను రౌడీషీటర్లు సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్వయంగా కొన్ని సందర్బాలలో ఆయా నాయకులే సెటిల్మెంట్ కావాల్సిన కేసులను అప్పగిస్తుంటారని రియల్ఎస్టేట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వివాదాస్పద భూములలోకి గ్యాంగ్‌లను దింపి.. రౌడీషీటర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారని, అవసరమైనప్పుడు జనాలను దింపి, అవతలి వ్యక్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ తమకు అనుకూలంగా సెటిల్మెంట్లు చేసుకునే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది.
కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్‌రెడ్డిని హత్య చేసిన ధన్‌రాజ్ యాదవ్, డానియల్ అలియాస్ జోసెఫ్‌లతో హతుడికి పాత పరిచయం ఉంది. అందులో ధన్‌రాజ్ యాదవ్‌పై రౌడీషీట్ ఉన్నట్లు శ్రీకాంత్‌కు కూడా తెలిసినట్లు సమాచారం. భోగారంలో ల్యాండ్ సెలిట్మెంట్కు సంబంధించిన పైరవీలో ధన్‌రాజ్ అతని గ్యాంగ్‌కు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. 20 రోజుల క్రితం కూడా సెటిల్మెంట్ డబ్బుల విషయంలో వివాదం జరగగా సర్ధుకుంటుందని శ్రీకాంత్ భావించినట్లు సమాచారం.
అయితే రౌడీషీటర్ ఎంతకైనా తెగిస్తాడని శ్రీకాంత్ ఉహించలేదు. తెలిసిన వాడు, తనకు బాడీగార్డుగా ఉండడంతో రక్షణగా ఉంటాడనుకున్నాడు. రక్షాసుడై హత్య చేస్తాడని ఏ మాత్రం ఉహించలేదు. అయితే రౌడీషీటర్ గ్యాంగ్‌లో ఇంకా ఎవరున్నారు, ఈ విషయంలో గతంలో ఏం మాట్లాడారు, అసలు ఆర్థికపరమైన వివాదాలు ఎక్కడ మొదలయ్యాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ధన్‌రాజ్, డానియల్‌కు సంబంధించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.