వెంగళరావునగర్, జూలై 28: క్షణికావేశంలో రూమ్మెటైన ఉపాధ్యాయుడిని హాస్టల్లో హత్య చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడితో కలిసి ఆలస్యంగా హాస్టల్‌కు వచ్చిన నిందితుడిని ప్రశ్నించడమే ఆ ఉపాధ్యాయుడి ప్రాణం మీదికి వచ్చింది. ఆవేశానికి లోనైన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి చంపేశాడు.
ఈ దారుణం ఎస్ఆర్ నగర్‌లోని హనుమ యోగాలక్ష్మి అన్నపూర్ణ బాయ్స్ హాస్టల్లో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటరమణ(38)ధరంకరం రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగేండ్లుగా ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ.. ఎస్ఆర్నగర్లోని హనుమ యోగాలక్ష్మి అన్నపూర్ణ బాయ్స్ హాస్టల్లోని రూమ్ నం.10లో ఉంటున్నాడు.
వెంకటరమణ ఉంటున్న షేరింగ్ రూమ్‌లోనే ఏలూరు నివాసి గణేశ్(28) కూడా రెండు నెలలుగా ఉంటున్నాడు. వీరితోపాటు ఇదే గదిలో కేశవ్‌సింగ్, అజయ్, అరుణ్ కూడా ఉంటున్నారు. క్షౌర వృత్తి చేసే గణేశ్ హాస్టల్ సమీపంలోనే ఉన్న సెలూన్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మరో మిత్రుడితో కలిసి గణేశ్ మద్యం తాగాడు. తాను ఉంటున్న హాస్టల్ గదిలోకి వస్తూ తలుపులను కాలుతో తన్నాడు.
దీంతో పెద్ద శబ్దం రావడంతో నిద్రలేచిన వెంకటరమణ ఇదేమిటని, ఎందుకు గొడవ చేస్తున్నావని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గణేశ్ తన మిత్రుడితో కలిసి గదిలోనే బిర్యానీ తిన్నాడు. ఆ తరువాత కూడా తలుపును పెద్దగా చప్పుడు చేయడంతో మళ్లీ నిద్రలేచిన వెంకటరమణ.. శబ్దం చేసి మా నిద్రకు ఎందుకు భంగం కలిగిస్తున్నావని ప్రశ్నించడంతో.. అతడిపై గణేశ్ దాడికి పాల్పడ్డాడు. గణేశ్‌తో వచ్చిన మిత్రుడు అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆ సమయంలో గదిలో ఉన్న కేశవ్‌సింగ్, అజయ్ వెంటనే హాస్టల్ నిర్వాహకుడైన నాగేశ్వర్రావుకు ఫిర్యాదు చేసేందుకు కిందకు వచ్చారు. దీంతో గణేశ్ తన వద్దనున్న గడ్డం గీసే కత్తితో వెంకటరమణపై దాడి చేశాడు. గొంతు, చేయిపై కత్తితో దాడి చేసి, కోయడంతో వెంకటరమణకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. అనంతరం గణేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. హాస్టల్ నిర్వాహకుడు, గదిలో ఉంటున్న కేశవ్‌సింగ్, అజయ్పైకి వచ్చి చూడగా.. గదిలో వెంకటరమణ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
వెంటనే 108కు సమాచారమిచ్చారు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించి చనిపోయినట్లు నిర్ధ్దారించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ పి.వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సందర్శించారు. గదిలోకి గణేశ్‌తో వచ్చిన అతడి మిత్రుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హాస్టల్ నిర్వాహకుడు నాగేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.