సైదాబాద్, జూలై 19 : పట్టపగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్ చందునాయక్‌ను కాల్చి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హయత్‌నగర్ మండలం కుంట్లూర్ వద్ద వేసిన 13 వందల మంది గుడిసెవాసుల వద్ద వసూలు చేసిన నగదు, బిల్డిర్ వద్ద నుంచి వసూలు చేసిన నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలే హత్యకు దారి తీసింది.
ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందు నాయక్‌ను రాజన్న అతడి అనుచరులు ఒక మూఠాగా ఏర్పడి హత్య చేశారని సౌత్ఈస్ట్ జోన్ డీపీపీ చైతన్యకుమార్ వెల్లడించారు. శనివారం సాయంత్రం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందే శ్రీనివాస్, మలక్‌పేట, సైదాబాద్ డివిజన్ల ఏసీపీలు సుబ్బరామిరెడ్డి, సోమ వెంకట్ రెడ్డిలతో కలిసి వెల్లడించారు.
చైతన్యపురిలో నివసించే కేతావత్ చందు నాయక్ (48) సీపీఐ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న మలక్‌పేట్ మూసారాంబాగ్ డివిజన్ పరిధిలోని శాలివాహన నగర్ పార్క్ వద్ద వాకింగ్ చేసి బయటకు వస్తున్న అతడిపై దొంతి రాజేశ్, అలియాస్ రాజన్న తన అనుచరులతో కలిసి రివాల్వర్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు.
తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడి చందు నాయక్ కంట్లో కారం పోసి హత్య చేశారు. ప్రధాన నిందితుడు రాజన్నతో పాటు ఏడుకొండలు, అర్జున్ జ్ఞానప్రకాశ్, లింగిబేడి రాంబాబు, ప్రశాంత్, శ్రీను అలియాస్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పిస్టల్, రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ జయశంకర్,సైదాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
న్యాయం చేయాలంటూ ఆందోళన..
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గిరిజన సంఘం మహిళలు, అనుచరులు, బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రవీంద్రాచారి, యాదిరెడ్డిలతోపాటు మరికొందరిని అరెస్ట్ చేయాలంటూ స్టేషన్ ముందు నిరసన తెలియజేయటంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది.