కుత్బుల్లాపూర్, మే 5 : చింతల్లో సంచలనం సృష్టించిన కనాల శివారెడ్డి హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో శివారెడ్డి చేస్తున్న వేధింపులు భరించలేక అతడితో సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమారుడు కలిసి ఈ ఘాతాకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితురాలు గర్లపల్లి అరుణ సుమారు 10 ఏళ్ల క్రితం బాలానగర్‌లోని సూర్య ఇంజినీరింగ్ వర్క్స్‌లో కూలీగా పని చేస్తుండగా కనాల శివారెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారితీసింది.
అరుణ తన కుమారుడు సాయిరత్నంతో కలిసి శివారెడ్డితో సూరారం, షాపూర్‌నగర్ వంటి ప్రాంతాల్లో నివసించేది. గత పది నెలల కిందట చింతల్‌లోని చెరుకుపల్లి కాలనీలో అద్దెకు దిగారు. మద్యానికి బానిసైన శివారెడ్డి రోజూ తాగి వచ్చి అరుణను, ఆమె కుమారుడిని శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేసేవాడు. ఈ వేధింపులు భరించలేక తల్లీకొడుకులు కలిసి ఈ నెల 3న అర్ధరాత్రి శివారెడ్డి నిద్రపోతున్న క్రమంలో అతని మెడపై కత్తితో దాడి చేసి హతమార్చారు. ఇంటి యజమాని సమాచారంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ బాలగంగిరెడ్డి, సీఐ గడ్డం మల్లేశ్, పోలీసులు ఉన్నారు.
దాడి కేసులో నిందితులు అరెస్ట్
రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దాడిచేసి గొలుసు, ఫోన్‌ను లాక్కెళ్లిన ఆరుగురు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరాల ప్రకారం.. ఏప్రిల్ 14న రాత్రి 11 గంటలకు రాగం రాకేశ్ శర్మ, అతని స్నేహితుడు హరీశ్‌రెడ్డి హెచ్ఎంటీ జంగల్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆరుగురు దుండగులు వారిని అడ్డుకున్నారు. బాధితులపై దాడిచేసి రాకేశ్ శర్మ మెడలో 7.5 గ్రాముల బంగారు గొలుసు, వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులు బి.సాయికిరణ్(21), సీహెచ్ నవీన్(28), గుగులోతు అనిల్, పాండు, ఈశ్వర్, సాయితేజలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.