బంజారాహిల్స్.అక్టోబర్ 9 : జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్(Jubilee Hills Police Station) పరిధిలోని నవోదయ కాలనీలో గత నెల 30న చోటు చేసుకున్న మహిళ హత్య కేసును(Murder case) పోలీసులు చేధించారు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తుండడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుదారాణి(44) అనే మహిళ గత నెల 30న సాయంత్రం తన ఇంట్లో దారుణహత్యకు గురయింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు సుధారాణి ఫోన్ కాల్స్డేటాతో పాటు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆమెను హత్య చేసింది షేక్ జావెద్ అలియాస్ అమీర్ అలీ (34)గా గుర్తించారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన షేక్ జావెద్‌కు రెండేళ్లుగా సుధారాణితో పరిచయం ఉంది. నగరంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జావెద్ సుధారాణి వద్ద చిట్టీ వేస్తున్నాడు.
కాగా, తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఇంటికి పిలిపించి బెదిరింపులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెడతా అంటూ హెచ్చరించడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించు కున్న షేక్ జావెద్ గత నెల 27నుంచి రెక్కీ నిర్వహించాడు. మృతురాలి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని గత నెల 30న ఆమె ఇంట్లోకి ప్రవేశించి కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె బెడ్రూమ్లో ఉన్న బంగారం తస్కరించి ఉడాయించాడు. ఈ మేరకు పరారీలో ఉన్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.