Hyderabad | ఖైరతాబాద్, జూలై 28: కూటి కోసం అరబ్ దేశాలకు వెళ్లి తిరిగి రాలేక వందలాది మంది అక్కడే మగ్గిపోతున్నారని మార్క్ పబ్లికేషన్ వ్యవస్థాపకులు, సీఈవో మురళీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు స్థానికంగా పనులు దొరకక దుబాయి, మస్కట్, కువైట్ లాంటి దేశాలకు వెళ్తుంటారని, వారి ఆశను ఆసరా చేసుకొని కొందరు ప్రైవేట్ ఏజెంట్లు అడ్డికి పావుసేరు లెక్కన డబ్బులు తీసుకొని, వారిని అక్రమ మార్గంలో అరబ్ దేశాలకు పంపుతున్నారన్నారు.
చదువుకున్న వారి కంటే చదుకోని వారు అక్కడ సురక్షితంగా ఉండే పరిస్థితి లేదని, ఇండ్లలో బానిసల్లా మార్చుకొని వారిని చిత్రహింసలకు గురిచేస్తూ పనులు చేయించుకుంటారన్నారు. ఎందరో అక్కడి వారు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నారన్నారు. ప్రధానంగా ఆడపిల్లలను అక్కడ శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నారని, సరైన పద్ధతిలో వెళ్లకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.
ప్రైవేట్ ఏజెంట్లు సొమ్ముకు ఆశపడి అక్కడికి అక్రమ మార్గంలో పంపుతున్నారని, అక్కడి వారు సైతం తప్పుడు మార్గంలో ఆడపిల్లలను రప్పించుకొని వారితో వెట్టిచాకిరి చేయిస్తూ హింసలకు పాల్పడుతున్నారన్నారు. అరబ్ దేశాలకు వెళ్లే భారత ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులో ఉందని, దాని సాయంతో వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చాలా మంది అవగాహన లేకనే ప్రైవేట్ ఏజెంట్ల మోసానికి బలవుతున్నారన్నారు. ఇప్పటికే 15 మంది ఆడపిల్లలు అక్కడ చిక్కుకుపోయారని, కొందరిని ఎంబసి, స్వచ్ఛంద సేవకుల సాయంతో రప్పిస్తున్నామన్నారు.
కాలు విరిగినా కనికరించలేదు
మాది ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లా గొల్లగొట్టిపాలెం. నాకు భర్త వెంకటేశ్, ఎనిమిదేండ్ల కొడుకు ఉన్నారు. రెండేండ్ల క్రితం సంజీవ్ అనే ఏజెంటు ద్వారా మస్కట్‌కు ఇంట్లో పనిచేసేందుకు వెళ్లాను. వంద రియాల్‌కు పనిలో కుదిరాను. యజమాని, అతని భార్య, ఇద్దరు పిల్లలకు సపర్యలు చేయడం నా ఉద్యోగం. చేరిన కొత్తలో కొద్ది రోజులు బాగానే ఉన్నారు. రోజులు గడుస్తున్నా కొద్ది నాపై చేయి చేసుకోవడం ప్రారంభించారు. రోజు నన్ను కొట్టే వారు చిత్రహింసలకు గురిచేశారు. పాస్ట్‌పోర్టును లాక్కొని, నానా ఇబ్బందులు పెటేవారు.
ఆ బాధలు భరించలేక రెండుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ఇంట్లో వారికి ఫోన్ చేద్దామనుకుంటే చేయనివ్వరు. ఓ సారి కిందపడిపోగా, ఒక కాలు విరిగింది. అయినా వారు కనికరించలేదు. అలాగే, నాతో పనిచేయించుకున్నారు. మా అమ్మ కూడా ఖతర్‌లో పనిచేస్తుంది. ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళ సహాయంతో మా అమ్మకు ఫోన్ చేశాను. ఆ ప్రయత్నం ఫలించ లేదు. అక్కడ ఉన్న తెలుగు వారి సాయంతో మురళీ రామకృష్ణారెడ్డి ఫోన్ నంబరు తీసుకొని ఆయనను సంప్రదించాను. అక్కడే ఉన్న తెలుగు వారు బొంతు నాగరాజు, రాజీలకు సమాచారాన్ని చేరవేశారు. వారు అక్కడి ఎంబసీని కలిసి తనను బంధ విముక్తురాలిని చేశారు.
– మంగ నిర్మలా కుమారి, బాధితురాలు