మేడ్చల్ జోన్ బృందం, జూన్ 16: పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, సమస్యలు తొలిగిపోయి, అభివృద్ధికి అడ్రస్‌గా మారాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడలో శుక్రవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వైకుంఠధామాలు, పట్టణ ప్రకృతి వనాలు తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
మున్సిపాలిటీల్లో అధికారంలోకి వచ్చిన పాలకవర్గం రెండేళ్ల పాటు కరోనా పరిస్థితులతో ఇబ్బందులుపడిన, ఆ తర్వాత ప్రభు త్వం అందిస్తున్న చేయూత, సమకూరుతున్న ఆదాయంతో కోట్ల రూపాయల పనులు చేపట్టారని తెలిపారు. చైర్మన్లు, వైస్ చైర్మ న్, కో ఆప్షన్ సభ్యులు టీం వర్క్ చేయడంతో అనూహ్య అభివృద్ధి జరిగిందన్నారు. మేడ్చల్‌లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డు కూడా లభించిందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పాలకవర్గాలకు సూచించారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు శ్రమిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బోనాల ఊరేగింపు నిర్వహించారు. కార్మికులు, ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాల ను అందజేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, బహుమతులను ప్రదానం చేశారు. మానవహారాలను నిర్మించారు.