బడంగ్‌పేట, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ) : ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గోల్మాల్ చేసిన పాత కమిషనర్ రిటైర్డ్ అవ్వడానికి ముందు మరో రూ.16 లక్షలను కాజేసేందుకు మరో టెండర్ పిలవడం విశేషం. ఇదంతా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగింది. కమిషనర్‌గా జ్ఞానేశ్వర్ ఉన్న సమయంలో రూ.24 లక్షల ఎలక్ట్రిషన్ పనుల కోసం టెండర్ ఆహ్వానించారు.
ఈ టెండర్‌ను కాంట్రాక్టర్లందరికీ అందుబాటులో ఉంచకుండా కేవలం రెండు రోజుల్లోనే ముగించారు. టెండర్ వేసిన తర్వాత 7రోజుల సమయం ఇవ్వాలి. అలా కాకుండా అధికారులు ఎవరికి తెలియకుండా సెలవు దినాలను ఎంచుకొని టెండర్ వేసినట్లు కొంత మంది కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఏడాది మే 18న మధ్యాహ్నం 2.10 గంటలకు టెండర్ వేస్తే 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో కన్పించినట్లు కొంత మంది కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. మే 20న ఉదయం 10.30 గంటలకు టెండర్ ఓపెన్ చేశారు. రూ.24,57,200లక్షలకు టెండర్ ఎస్వీఎస్ ఎలక్ట్రికల్ ఏజెన్సీకి టెండర్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వర్క్ ఆర్డర్ తీసుకునే టప్పుడు సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్కు చూయించి రికార్డు చేయవలసి ఉంటుంది. టెండర్ వేసిన విషయం గాని, టెండర్ ఓపెన్ చేసిన విషయంగాని, మెటీరియల్ తీసుకొచ్చిన విషయంగాని వర్క్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇవ్వలేదని సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు.
ఇలా పనులు చేయకుండానే రూ.24లక్షలు కాజేశారు. అనంతరం మరోసారి రూ.16 లక్షల పనులకు టెండర్లు ఆహ్వానించారు. మెయింటెనెన్స్, లైట్లు, వైరింగ్ రిపేర్ కోసం జూన్ 26న రూ. 16, 79, 279లక్షలకు టెండర్ వేశారు. ఈ లోపున కమిషనర్ రిటైర్డ్ కావడం, డీఈలు, ఏఈలు బదిలీ కావడంతో టెండర్ ఓపెన్ చేయలేక పోయారు. కొత్తగా వచ్చిన డీఈ కి పోన్ చేసి పనులు చేయించాం టెండర్ ఓపెన్ చేయాలని రిటైర్డ్ కమిషనర్ జ్ఞానేశ్వర్ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో గతంలో వేసిన టెండర్లలో అవకతవకలు జరిగినట్లు తెలుసుకున్న ఇన్చార్జి కమిషనర్ వాణి రెడ్డి టెండర్‌ను ఓపెన్ చేయలేదు. పెట్టిన బిల్లులే రెండు మూడు సార్లు పెట్టి నిధులు గోల్ మల్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది