సిటీబ్యూరో : ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ గొలుసుకట్టు సంస్థ ఇగ్నైట్ భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో కేవలం 18 రోజుల క్రితమే ఏర్పాటు కాగా, ఈ సంస్థపై ఉక్కుపాదం మోపడం ద్వారా సుమారు రూ.5వేల కోట్ల మేర జరగబోయే మోసాన్ని అడ్డుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్ పేరుతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మెరుపుదాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
గురువారం టీజీఐసీసీసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ ఆపరేషన్ ఇగ్నైట్కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్లిక్గోబల్, క్యూనెట్ నిర్వాహకులే ఈ ఇగ్నైట్ సంస్థ వెనక ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సీపీ చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అమలు చేస్తూ మొదట గోల్డ్‌క్వెస్ట్, ఆ తర్వాత క్వెస్ట్‌నెట్, ఆపై క్యూనెట్, ఇప్పుడు ఇగ్నైట్ పేరుతో ఈ ముఠా రూపాంతరం చెందిందని సీపీ వివరించారు. ఈ ముఠా గుట్టును పసిగట్టిన హైదరాబాద్ సిటీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం చాకచక్యంగా వ్యవహరించి వీరి పన్నాగాన్ని భగ్నం చేసింది. అరస్టైన వారిలో ఇగ్నైట్ టీమ్ లీడర్ ఢిల్లీకి చెందిన ఒనియల్ గుప్తా, యూపీలోని ఇండి కనెక్ట్ వెంచర్స్ డైరెక్టర్లు దినేష్‌కుమార్ సాహిల్, ప్రియాన్షుసక్సేనా, కోల్‌కతాలోని పారస్నాథ్ మెర్కంటైల్ డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, పరితోష్కుమార్, కేరళకు చెందిన ఫీల్డ్ రిక్రూటర్ రియాజ్‌లు ఉన్నారు.
వీరిపై బీఎన్ఎస్, తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, ఐటీయాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు పత్మన్ సేనాథిరాజా, విజయ్ఈశ్వరన్లపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయగా నిందితులు వాట్సాప్, జూమ్కాల్స్, షాపింగ్‌మాల్స్ వంటి వేర్వేరు మార్గాల్లో ఎరవేసి రూ.60వేల చొప్పున వసూలు చేసి కోల్‌కతాలోని భవానీపూర్ శాఖకు చెందిన పారస్నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలో జమచేయించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు వేర్వేరు మార్గాల్లో ముగ్గురు బాధితులను నమ్మించి రూ.1.87లక్షలు కాజేసిన ఘటనపై ఈనెల 5,6 తేదీలలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
బాధితుల నుంచి అందిన మూడు ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, ఈ వ్యవహారాన్ని సీపీ కార్యాలయం నుంచి తదుపరి విచారణ కోసం సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్తున్నామని సజ్జనార్ చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ స్కామ్‌కు సంబంధించిన ప్రధాన సూత్రధారులు హాంకాంగ్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ హాంకాంగ్ కేంద్రంగా గత 25 ఏళ్లుగా పనిచేస్తున్నదని సీపీ చెప్పారు. భారత్‌లో దీనికోసమే ఈ సంవత్సరం మే 18న ఇండికనెక్ట్ వెంచర్స్ పేరుతో డమ్మీ సంస్థను పెట్టారని ఆయన తెలిపారు.
చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే సిమెట్రా అనే అయస్కాంతపెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే యాక్టివా అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్ మార్కెట్లో రూ.600 కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను బ్రష్-ఓ పేరుతో ఏకంగా 680 అమెరికన్ డాలర్లకు అమ్మడమే కాకుండా బ్రయినిఫై అనే ఏఐ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ వంటివి ఈ సంస్థ ద్వారా అందిస్తున్నామని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారని
సజ్జనార్ చెప్పారు.