సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలను సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్, ఎస్వోటీ డీసీపీ శోభన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన దిలీప్ సింగ్ (27) జీడిమెట్లలోని అపురూప కాలనీలో నివాసముంటూ… ఓ ప్రైవేటు కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ప్రకటన ద్వారా జోర్డాన్, పింటూ భయ్యా అనే వ్యక్తులతో పరిచయం ఏర్పర్చుకున్నాడు.
తమ కు బ్యాంకు ఖాతాలను సమకూర్చితే భారీ కమీషన్ ఇస్తామని , సేవింగ్స్ ఖాతాకు రూ.25 వేలు, కరెంట్ ఖాతాకు రూ.50 వేల వరకు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో దిలీప్‌సింగ్ అంగీకరించాడు. తన బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఇతర ఖాతాలను కూడా సమకూర్చాడు. ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, పాస్ బుక్, చెక్ బుక్ తదితర వివరాలను మోసగాళ్లకు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం పోలీసులు దిలీప్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.02 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు, 12 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు, మూడు బ్యాంకు పాస్ బుక్, ఏడు చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.