సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మ్యూల్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారాయి. ఆన్లైన్ ద్వారా దోచుకున్న సొమ్మును మ్యూల్ ఖాతాల ద్వారా దేశాలను దాటిస్తూ సైబర్ మోసగాళ్లు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సరఫరా చేస్తున్న ఏడుగురు నిందితులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ సాయిమనోహర్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
రాపర్తి గౌతమ్, సేనాపతి పెంటయ్య, బోడాల సాయికుమార్, మురపాకల కుమార్, విజ్జిపు సత్యనారాయణ, మంత్రి సాయి కుమార్, ఉట్ల సత్యనారాయణ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు సైబర్ మోసగాళ్లకు మ్యూల్ ఖాతాలు సరఫరా చేస్తుండగా మరికొందరు అకౌంట్ హోల్డర్లు, క్యాష్ సప్లయర్లు, క్యాష్ రిసీవర్లుగా వ్యవహరించారు. బోడాల సాయికుమార్ సైబర్ మోసాల ద్వారా వచ్చిన నగదును సేకరించి రాపర్తి గౌతమ్‌కు అప్పగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రధాన నిందితుడు సేనాపతి గణేష్ ఆదేశాల మేరకు గౌతమ్ ఆ నగదును సేనాపతి పెంటయ్యకు అందజేసినట్లు గుర్తించారు. పెంటయ్య ఆ మొత్తాన్ని వ్యవస్థీకృత సైబర్ నేర ముఠా తరఫున స్వీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లావాదేవీల్లో మంత్రి సాయికుమార్ నగదు రవాణాలో నేరగాళ్లకు సహకరించడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందం రాయదుర్గం, మణికొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తున్న సత్యనారాయణను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
ఇతరులకు బ్యాంక్ ఖాతాలిస్తే జైలే..
డబ్బు కోసం తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు లేదా కేవైసీ పత్రాలను ఇతరులకు ఇవ్వడం నేరమని, అలా చేస్తే జైలు శిక్ష తప్పదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అధిక లాభాల ఆశ చూపే అనధికారిక ట్రేడింగ్ యాప్‌లను నమ్మవద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. మ్యూల్ ఖాతాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే బ్యాంకు సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖాతాలను తెరిచే సమయంలో కేవైసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీల నివేదికలను సకాలంలో సమర్పించాలని బ్యాంకులకు సూచించారు.