Banda Prakash | ఖైరతాబాద్, ఫిబ్రవరి 16 : ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. సామాజికవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, యువతను ప్రోత్సహించాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సేవ, సలహాలు అందించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు.
సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ.. ముదిరాజ్‌లు సంఘటితంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. వర్గాలుగా విడిపోతే ప్రభుత్వాలు గుర్తించవని, ఏకతాటికపై వస్తే అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగవచ్చని అభిప్రాయపడ్డారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా, విద్యపరంగా బలోపేతం కావాలని, విద్య ఉన్నత స్థానాల్లో నిలబెడుతుందని తెలిపారు. భావితరాలకు స్ఫూర్తినింపేలా విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్, పండుగ సాయన్న లాంటి వారి చరిత్రను వివరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ఇప్పటికే పార్లమెంట్ 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, స్థానిక సంస్థల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మహిళలను బాగస్వాములను చేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటైనా, కావాల్సిన నిధులు సాధించుకోవాలన్నారు.
తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఆంజనేయులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్, న్యాయవాదులు పాండు ముదిరాజ్, అర్జున్ కుమార్, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.