PhD Admissions | ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్ల ఫలితాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగ విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా కుట్రలు చేస్తున్న ఓయూ ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఓయూలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుపై జరుగుతున్న కుట్రపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొమ్ము శేఖర్ మాట్లాడుతూ.. ఓయూ పీహెచ్డీ అడ్మిషన్లలో వర్గీకరణ చట్టం అమలుపై కుట్రలు జరుగుతుంటే మాదిగ ప్రొఫెసర్లు మాట్లాడకుండా మౌనంగా ఉండటం అంటే జాతికి ద్రోహం చేయడమేనని అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో మాదిగలు, ఉప కులాలు నష్టపోవడం వల్లనే గత మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ సుదీర్ఘంగా ఉద్యమించిందన్నారు. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలవుతుందని చెప్పారు.
ఓయూ పీహెచ్డీ నోటిఫికేషన్ (11.01.2025), ఈఏపీసెట్ నోటిఫికేషన్ (20.02.2025)లు ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు కాకముందే ఇచ్చారని, కానీ వర్గీకరణ చట్టం అమలైన తర్వాతనే పరీక్షలు జరిగాయని వివరించారు. ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ఓయూ పీహెచ్డీ అడ్మిషన్లలో వర్గీకరణ చట్టం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓయూ ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మాదిగ మంత్రులుగా చెలామణి అవుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దామోదర రాజనర్సింహ తక్షణమే స్పందించి మాదిగ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పీహెచ్డీ అడ్మిషన్ల విషయంలో ప్రొఫసర్ కరుణ సాగర్ చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ కూడా పీహెచ్డీ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలని సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. మాదిగ విద్యార్థులకు పీహెచ్డీ అడ్మిషన్లలో న్యాయం జరిగే వరకు ఎంఎస్ఎఫ్ పోరాడుతుందని స్పష్టం చేశారు.