సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలపై ఎంసెట్ విద్యార్థులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఆయా కళాశాలల్లో నాణ్యమైన విద్యా విధానం అందుబాటులో ఉంటుందని భావించిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంపిక చేసుకుంటున్నారు. అటానమస్ కళాశాలలతో పాటు తాము ఎంపిక చేసుకున్న ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా ఉండటంతో పాటు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్ (న్యాక్) గుర్తింపు ఉండాలంటున్నారు. అలాగే, ఏయే కాలేజీలలో ఏయే కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) కూడా ఉండాలంటున్నారు. వాటితో పాటు జేఎన్టీయూనో, ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తింపు ఇవ్వడంతో పాటు ఏఐసీటీఈ అనుమతులు కూడా ఉండాలని, ఆయా కాలేజీలలో ప్రవేశాలు చేరతామని విద్యార్థులు అంటున్నారు. ఇన్ని రకాల అనుమతులు ఉన్న కాలేజీలలో ప్రవేశం పొందడానికి కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థులు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే.. మిగితా కళాశాలల వైపు వెళ్తున్నట్లు కౌన్సెలింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఓసీఈ)కు మంచి డిమాండ్ ఉన్నది. ఇక్కడ మంచి ప్లేస్మెంట్, రీసెర్చ్ అవకాశాలు ఉండటంతో మెరిట్ విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకుంటున్నారు.
జేఎన్టీయూ, ఓయూ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అటానమస్ కళాశాలలు, న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందిన కళాశాలలు, యూనివర్సిటీ అఫిలియేషన్ పొందిన కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం వెబ్ ఆప్షన్ల ఎంపికలో మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత కళాశాలల వారీగా ఉన్న ఈసీఈ, ఐటీ బ్రాంచ్‌ల తర్వాత మెకానికల్, సివిల్, ఈఈఈ వంటి బ్రాంచ్‌లను చివరి ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.