ఖైరతాబాద్, అక్టోబర్ 12 : దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహించి రిజర్వేషన్లు సాధించుకునే తరుణంలో ఆ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, సంఘటితంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజ్జ సత్యం అధ్యక్షతన ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి బీసీలు తమ హక్కులకు నోచుకోకుండా పోయారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు బాగపడడం లేదన్నారు.
ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న 42 శాతం రిజర్వేషన్లు సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు వేసిన రోజు కాని, వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కాని, సుప్రిం కోర్టుకు పోయినప్పుడు కాని కోర్టు స్టే ఇవ్వాల్సి ఉందని, అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇచ్చిన చరిత్రలో ఇప్పటి వరకు దేశంలో లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో స్టే ఇవ్వరాదని సుప్రిం కోర్టు స్వయంగా తీర్పునిచ్చిందన్నారు.
ఇక నుంచి రిజర్వేషన్ల కోసం అడుక్కునే ఆలోచన పోవాలని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని, 14న జరిగే రాష్ట్ర బంద్‌ను వాయిదా వేస్తున్నామని, 18న తెలంగాణ బంద్ నిర్వహించాలని నిర్ణయించామని, బీసీ ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ బీసీ జేఏసీ నూతన కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మన్‌గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా రాజారాం యాదవ్, దాసు సురేశ్, కోఆర్డినేటర్‌గా గుజ్జ కృష్ణ తదితరులను ఎన్నుకున్నారు.