బాలానగర్, ఆగస్టు 29 : పేదల ఇండ్ల జోలికి వస్తే సహించేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి బోయిన్ చెరువును(Boyin pond) ఎంపీ ఈటల రాజేందర్( Etala Rajender), డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్లు సందర్శించారు. గత 40 సంవత్సరాలకు పైబడి ఇక్కడ కూలి పని చేసుకుంటు జీవిస్తున్నామని స్థానికులు ఆయనకు వివరిం చారు. అప్పటి నుంచి మున్సిపల్ ట్యాక్స్ రసీదులు, విత్యుల్ బిల్లుల రసీదులు ఆయనకు చూపించారు.
ప్రస్తుతం రెవెన్యూ విభాగం అధికారులు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధి అంటూ నోటీసులు ఇస్తున్నారని ఎంపీతో స్థానికులు వాపోయారు. అనంతరం ఎంపీ ఈటల మాట్లాడుతూ.. కూలి పని చేసుకొని జీవించే నిరుపేదలు 1980 నుంచి ఇండ్లు కట్టుకొని నివాసముంటున్న వారికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం శోచనీయం అన్నారు.
ఇక్కడి పేదలు ఇండ్లు కట్టుకున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. పేదల ఇండ్లకు హైడ్రా(Hydra) పేరుతో ఆటంకం కల్పిస్తామంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అధికారులు చేస్తున్న పొరపాటును గుర్తించకుండా ప్రభుత్వాలు పేదలపై విరుచుకు పడడం సరికాదన్నారు. హైడ్రా నిరుపేదలను వదిలి బడా బాబులపై తమ ప్రతాపాన్ని చూపించాలని హితవు పలికారు.