మేడ్చల్, డిసెంబర్ 26: గుంతలు పడి, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజులుగా రోడ్డు మరమ్మతు దశలోనే ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అయోధ్య చౌరస్తా నుంచి కొంపల్లి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొంపల్లి వంతెన నుంచి అయోధ్య చౌరస్తా వరకు నాలుగు కిలో మీటర్ల వరకు ఉంటుంది. అందులో గుండ్లపోచంపల్లి కార్యాలయం నుంచి అయోధ్య చౌరస్తా వరకు ఉన్న దాదాపు రెండు కిలో మీటర్ల రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. రోడ్డుకు కోసుకుపోయి, గుంతలు పడి, కంకర తేలింది. ఈ దారిలో పలు బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలు ఉన్నాయి. అలాగే అయోధ్య చౌరస్తా, గౌడవెల్లి, రాయిలాపూర్, శ్రీరంగవరం, బండమాదారం, నూతన్‌కల్, సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఈ రోడ్డు వినియోగిస్తారు.
దీంతో ప్రతి రోజూ ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుంటాయి. పాడైన రోడ్డుపై దుమ్ము లేస్తూ ప్రయాణం కష్టంగా మారింది. ఎంత జాగ్రత్తగా వెళ్లినా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికులు, ప్రయాణికుల నుంచి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ప్రమాదాలు జరుగుతున్నాయి..
అయోధ్య చౌరస్తా నుంచి కొం పల్లి వరకు ఉన్న రోడ్డు కంకర తేలి, గుంతలమయంగా మారింది. ఈ గుంతల కారణాంగా వాహనాలు తొందరగా పాడవుతున్నాయి. చీక ట్లో గుంతలు కన్పించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి, వెంటనే కొత్తగా రోడ్డు వేయాలి.
-జైపాల్ రెడ్డి, కౌన్సిలర్, గుండ్లపోచంపల్లి
టెండర్లను ఆహ్వానించాం..
కొంపల్లి వంతెన నుంచి నూతన్‌కల్ గ్రామం వరకు 9.5 కిలో మీటర్ల రోడ్డును రూ.3 కోట్లతో నిర్మిస్తున్నారు. సాంకేత్ నుంచి యశోద కళాశాల వరకు 2 కిలోమీటర్లు, రాయిలాపూర్ నుంచి శ్రీరంగవరం వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాం. కొంపల్లి నుంచి అయోధ్య చౌరస్తా వరకు ఉన్న రోడ్డు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.