బంజారాహిల్స్,మే 5: వారంరోజుల వ్యవధిలో తమ ఇంట్లోనుంచి లక్షలాది రూపాయలు మాయం అయిన విషయాన్ని గమనించిన యజమాని.. రూ. 40వేలను ఎరగా వేసి దొంగలను పట్టేశాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘట న వివరాలను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న అజయ్ అనే వ్యాపారి ఇంట్లో మూడేళ్లుగా నల్గొండ జిల్లాకు చెందిన సైదమ్మ అనే మహిళ పనిచేస్తోంది. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న సైదమ్మ కుమార్తె (17) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిం ది. కాగా సైదమ్మ కుమార్తెకు అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న దేవకుమార్ అలియాస్ చింటూ(22) అనే యువకుడితో స్నేహం ఉంది.
ఇదిలా ఉండగా.. తన యజమాని ఇంట్లో పనిచేసేందుకు వెళ్తున్న సైదమ్మ వద్దకు కుమార్తె అప్పుడప్పుడూ వచ్చేది. యజమాని ఇంట్లో భారీగా డబ్బులు కనిపించడంతో కుమార్తెకు చెప్పి గతనెల మొదటి వారంలో సుమారు రూ.19లక్షల నగదును చోరీ చేయించింది. అయితే డబ్బులు పోయిన విషయాన్ని గుర్తించిన యజమానికి తన ఇంట్లోకి వచ్చే పనివారే చోరీ చేశారని అనుమానం వచ్చింది. దీంతో వారిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. ఈనెల 24న తన ఇంట్లో రూ.40వేల నగదును పనిమనిషికి కనిపించేలా పడేశారు. తల్లితో పాటు యజమాని ఇంటికి వచ్చిన కుమార్తె రూ.40వేల నగదును తస్కరించింది.
దీంతో తన అనుమానం నిజమేనని తేలడంతో రూ.40వేలు చోరీ చేసిన విషయంపై నిలదీయడంతో తన కుమార్తె తప్పు చేసిందని, తనకు తెలియకుండా డబ్బులు కాజేసిందని సైదమ్మ అంగీకరించడంతో పాటు రూ.40వేలు వెనక్కి ఇచ్చింది. మరుసటిరోజు నుంచి పనిమానేసింది. దీంతో తమ ఇంట్లో రూ.19లక్షల చోరీ విషయంపై బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సైదమ్మతో పాటు కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రూ.19లక్షలు చోరీ చేసినట్లు అంగీకరించారు. సైదమ్మ..తన కుమార్తె, ఆమె స్నేహితుడు దేవకుమార్తో కలిసి స్కెచ్ వేసిందని, చోరీ చేసిన సొత్తుతో బైక్ కొనుక్కోవడంతో పాటు ఐఫోన్ కొన్నారని తేలింది. నిందితుల వద్దనుంచి రూ.8లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు సైదమ్మ, దేవకుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.