Hyderabad | హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కవల పిల్లలను చంపి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సాయిలక్ష్మీ (27)కి అనిల్ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత పద్మారావు నగర్ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు. అయితే వీరు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చేతన్‌కు మాటలు రాకపోవడంతో కొంతకాలంగా స్పీచ్‌థెరపీ ఇప్పిస్తున్నారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సాయిలక్ష్మీ బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.