మేడిపల్లి/చర్లపల్లి/కంటోన్మెంట్: ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని హరితవనం కాలనీలో సురేందర్‌రెడ్డి, విజయశాంతిరెడ్డి(38) దంపతులు తమ పిల్లలు చేతనారెడ్డి(17), విశాల్‌రెడ్డి(16)తో కలిసి నివాసముంటున్నారు. కుమార్తె చేతనారెడ్డి ఇంటర్ చదువుతుండగా, కుమారుడు విశాల్‌రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
విజయశాంతిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉంటున్నాడు. శుక్రవారం విజయ తన పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే టర్మినల్ వద్ద కారును పార్క్ చేసి వెళ్లిపోయారు. అనంతరం ముగ్గురు చర్లపల్లి రైల్వేస్టేషన్ శివారులోని ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ వాకీ టాక్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేసుకున్న రైల్వే పోలీసులు ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.