సిటీబ్యూరో: గ్రేటర్లో ఆహార కల్తీ రోజురోజుకు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌క్రీం పార్లర్లు, మోమోస్ తయారీ కేంద్రాల నిర్వాహకులు , పాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇతర సంస్థలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేయనున్నది. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీకి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకునే అధికారం లేదు. నమూనాల సేకరణకే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిమితమవుతూ వస్తున్నారు.
ఇక మీదట ఉల్లంఘనలకు పాల్పడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలపై చర్యలు తీసుకునేలా, జరిమానా డబ్బులు జీహెచ్ఎంసీ ఖాతాలో జమ అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్నారు. కాగా, బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో నగరంలో ఆహార భద్రత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై సమావేశం నిర్వహించి.. అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అలాగే లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్, మాసబ్‌ట్యాంక్‌లోని డైన్ హిల్ హోటల్‌ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోటళ్లలో కిచెన్ పరిశుభ్రత పాటించడం లేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, హోటల్ యజమానులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని మేయర్ సూచించారు.