Betting Apps | సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటివరకు పంజాగుట్ట పీఎస్‌లో విచారించిన ఇన్ఫ్లూయెన్సర్స్ నుంచి సేకరించిన సమాచారంతో మరి కొంతమందిపై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా యాప్స్ నిర్వాహకులతో పాటు, ఇంకొంతమంది ప్రమోటర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు తీసుకున్నట్లు తెలిసింది.
అయితే యాప్ నిర్వాహకులు తమపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా అవసరమైన న్యాయసలహాలు తీసుకుంటున్నారంటూ తెలిసిన పోలీసులు వాటిని ఆత్మహత్యలకు కారకాలుగా చూపించే దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణలో ఒక సంవత్సర కాలంలో సుమారుగా 25 మంది వ్యక్తులు బెట్టింగ్యాప్స్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. అప్పట్లో నమోదైన కేసులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపించింది బెట్టింగ్ యాప్సేనంటూ రుజువు చేసే కోణంలో ప్రణాళిక సిద్ధం చేశారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న యువత వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఒక్క హైదరాబాద్‌లోనే ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరందరి ఆత్మహత్యలకు సంబంధించి కేసులను వెలికితీసి ఏ యాప్స్ ద్వారా వీరు గేమ్ ఆడారో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ప్రమోటర్స్, నిర్వాహకులపై కేసులు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌లో ఒరిజినల్ గేమ్స్ కంటే వర్చువల్ గేమ్స్‌కే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ గేమ్స్‌లోనే ఎక్కువగా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు.
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదికాలంలో సుమారు వంద కోట్లకు పైగా యాప్స్‌లో జనం నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు వర్చువల్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్స్ .. ఈ ఇద్దరిపై పోలీసులు దృష్టి పెట్టారు. విష్ణుప్రియ, టేస్టీ తేజా, రీతూ చౌదరిల విచారణలో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ యాప్స్ ద్వారానే అటు నిర్వాహకులకు, ఇటు ప్రమోటర్స్కు కూడా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ పోలీసులు ఇంత సీరియస్‌గా స్టెప్స్ తీసుకుంటుంటే ప్రమోటర్స్ , నిర్వాహకులు వారి పని వారు చేసుకుపోతున్నారు. కొత్త పేర్లతో యువతే టార్గెట్‌గా యాప్స్‌ను తీసుకొస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ యాప్స్‌కు మరింత డిమాండ్ పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రమోటర్స్ మరో కొత్త రూపంలో తమ ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తున్నారు.
ముఖానికి మాస్క్‌లు వేసుకుని బెట్టింగ్యాప్స్పై ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కొత్తకొత్త పేర్లతో ఐడిలు , గ్రూపులు క్రియేట్ చేసి వాటి ద్వారా జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో ఇన్ఫ్టూయన్సర్లు చెప్పినట్లు సమాచారం. అయితే వీటి ద్వారా వచ్చే ఆదాయం విషయంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. ఒక్కొక్కరిని గంటల తరబడి పీఎస్‌లో కూర్చోబెట్టి విచారించారు. వారు విచారించిన కాలం కొంత సేపే అయినా ఎక్కువ సేపు పిఎస్‌లో ఉంచుకుంటున్నారంటూ ప్రమోటర్స్కు సంబంధించిన గ్రూపులో చర్చిస్తున్నారు.
ఆ తర్వాత వాట్సప్ చాట్‌ను వెంటనే డిలీట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా తమ గ్రూపులో ఇకపై బెట్టింగ్ యాప్స్ లీగల్ అయినా, ఇల్లీగల్ అయినా ప్రమోట్ చేయవద్దని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్‌యాప్ నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఐపిఎల్ టార్గెట్‌గా తమ యాప్స్ ప్రమోషన్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారముంది. దీనిపై కేవలం ఆత్మహత్యలు కారణంగా చూపి వారిపై కూడా కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.