సిటీబ్యూరో, నవంబరు 9 (నమస్తే తెలంగాణ) : 11న నిర్వహించే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను మూడంచెల భద్రత నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక డోన్ల ద్వారా పోలింగ్ నిర్వహణను పర్యవేక్షించనున్నామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జాయింట్ సీపీ ఇక్బాల్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పోలింగ్ నిర్వహణపై మాట్లాడారు. ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, ఈ సారి తొలిసారిగా ఎన్నికల పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు పొడిగించినట్లు కర్ణన్ తెలిపారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ సమయం ఉంటుందని, ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలో క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సోమవారం రాత్రి కల్లా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలించి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకే సంబంధిత ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్‌కు సిద్దం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 4,01,365 ఓటర్లు ఉండగా 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కర్ణన్ పేర్కొన్నారు. 1200 మంది కన్నా ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉన్నాయన్నారు.
పోలింగ్ నిర్వహణలో 3 వేల మంది పాల్గొంటున్నారని, 19 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. నకిలీ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, ఒకటి రెండు సార్లు చెక్ చేశాకనే ఓటింగ్‌కు అవకాశం ఉంటుందన్నారు. పోలింగ్ నిర్వహణలో 1761 మంది సిబ్బంది ఎలక్షన్ బందోబస్తులో ఉంటారని, 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు హైదరాబాద్ అడిషనల్ సీపీ ఇక్బాల్ తెలిపారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు రూ.3.60కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ముగ్గురితో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని, బల్క్ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి సారించినట్లు చెప్పారు. గూగుల్‌పే, ఫోన్ పేల ద్వారా డబ్బుల పంపిణీ మార్గంపై ప్రత్యేక నిఘా ఉందని, ఇప్పటికే ఎస్బీఐ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశమైనట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ఓటరు ముందుగా తమ సెల్‌ఫోన్‌ను డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.