సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ) : విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం, పాఠశాలల పరిస్థితులు, కావాల్సిన సదుపాయాలు? ఇలా ఒక్కటేమిటీ పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారంపై స్పష్టత రానున్నది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘యూడైస్’ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ పోర్టల్‌లో ప్రతీ విద్యార్థికి ఒక పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఇస్తారు. దీంతో ఆ విద్యార్థి దేశంలో ఎక్కడ.. ఏ చదువు చదివినా తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పోర్టల్‌లో ప్రతీ విద్యార్థి యూడైస్‌లో నమోదు కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా ఒకే చోట నమోదు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ విద్యాశాఖాధికారులకు యూడైస్ పోర్టల్‌పై శిక్షణ కూడా ఇస్తున్నారు.
హైదరాబాద్‌లో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్, 3,500 వరకు ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలున్నాయి. సుమారు 7.58 లక్షల మంది విద్యార్థుల వరకు చదువుకుంటున్నారు. ఇక యూడైస్‌లో పొందుపర్చిన సమాచారానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు తదితర పథకాల వర్తింపు ఉండనున్నది. వివిధ రకాల నిధులను కూడా యూడైస్ ఆధారంగానే కేటాయిస్తారు.