మాదాపూర్, ఆగస్టు 26: కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన అధికంగా పన్నుల భారాన్ని మోపుతున్నదని ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఎన్సీ కేబుల్ నెట్ వర్క్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూడి, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూడి మాట్లాడుతూ టీ ఫైబర్ గత మూడున్నర ఏండ్లుగా అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. నానక్‌రాంగూడలో ఉన్న నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ నుంచి వచ్చే నెల అన్ని పోలీస్ స్టేషన్లకు కనెక్షన్లను అందించనున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో రెండు తెలుగు రాష్ర్టాల నుంచి దాదాపు 30వేల మంది కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 250 స్టాల్స్‌లను ఏర్పాటు చేయగా ఇంటర్నెట్ కేబుల్, టెలిఫోన్ కేబుల్‌తో పాటు అన్నిరకాల కేబుల్స్‌ను ప్రదర్శించారు.