సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: ‘గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సమస్య తీర్చుకున్నామని, అద్భుతమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, 24 గంటల కరెంటు సరఫరాతో పాటు మెట్రో, బస్షెల్టర్లు, ఎలక్ట్రికల్ బస్సులు, మున్ముందు ఎయిర్ పోర్టు మెట్రో..ఇలా దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటున్నామని’ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదంతా అల్లాటప్పా నాయకులతో సాధ్యమయ్యే అభివృద్ధి కాదని, విజన్ ఉన్న సీఎం కేసీఆర్ సంకల్ప శుద్ధితోనే సాధ్యమైందన్నారు. మంగళవారం బేగంపేట ధనియాలగుట్టలో రూ.8.54 కోట్లతో నిర్మించిన ‘మహా పరినిర్వాణ (వైకుంఠధామం)’ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాలుగు నెలల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించిన ఆయన.. నగరంలో ఇంకా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కులం, మతం అనే అంతరంలేకుండా అన్నిరకాల కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు చూడాలని కోరారు. గతంలో జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం చూస్తేనే బాగుందనిపించేదని, కానీ అంతకంటే అద్భుతంగా ధనియాలగుట్ట వైకుంఠధామం ఉందన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బల్కంపేటలో ఇంతేస్థాయిలో వైకుంఠధామం నిర్మించామన్నారు. బతికి ఉన్నప్పుడు కులం, మతం పేరిట కొట్లాడకుంటారు.. కనీసం చనిపోయిన తర్వాతనైనా అందరూ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభిప్రాయం మేరకు ఎల్బీనగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూడు మతాలకు ఒకే దగ్గర అద్భుతమైన వైకుంఠదామం నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ధనియాలగుట్ట వైకుంఠధామం మొత్తాన్ని తిరిగి చూడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు బాగా పని చేస్తున్నారని, వారిని మంత్రి అభినందించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంచి నాయకుడని, చక్కటి ఎమ్మెల్యే ఉండటం కూకట్పల్లి ప్రజల అదృష్టమన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన నాయకుడు అయినందున ఎప్పుడూ సామాన్య ప్రజల అవసరాలు తీర్చడమే అలవాటుగా మార్చకున్నారని అన్నారు. తనను ఎప్పుడు, ఎక్కడ కలిసినా.. పలానా డివిజన్ పని చెబుతారని, ఇంకా చాలా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారన్నారు. ‘అన్న మీరొక్కరే గెలిస్తే కాదు..ఎలాగూ మీరు గెలుస్తారు. బయట కూడా తిరగాలి. ఏం అనుకోవద్దు.. టైం తీసుకొని వస్తా’ అని కృష్ణారావుకు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన ప్రసంగంలో కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడటాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి తలసాని చెప్పినవి వాస్తవాలని, చక్కటి మాటలన్నారు. ఉత్తేజపరిచే విధంగా మాట్లాడిన ఆయనకు ఎందుకో కోపం వచ్చిందని, ఇంత పొద్దుగాల ఇంత కోపంగా మాట్లాడతారని తాను అనుకోలేదన్నారు. ‘మీ అనుభవం, వయసు ముందు విమర్శలు చేసే వాళ్లు ఎంత? మీ అంత అనుభవం, జ్ఞానం వాళ్లకు లేదు. వాళ్లు ఏదో అన్నారని మీరు పట్టించుకోవద్దు. మనసు బాధపెట్టుకోవద్దు’ అని మంత్రి కేటీఆర్ తలసానికి సూచించారు.
హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ విస్తరించడంతో పాటు జనాభా గణనీయంగా పెరుగుతున్నదని, ఈ క్రమంలో కోటిన్నర జనాభాకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పిస్తున్న దార్శనికుడు సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ధనియాలగుట్టలో ఒకవైపున మసీదు, దర్గా, శ్మశాన వాటిక ఉందని, వాటిని కూడా రెండు నెలల్లో అద్భుతంగా చేయాలని అధికారులకు చెప్పామన్నారు. అన్ని మతాలకు ఈ సౌకర్యాన్ని కల్పించాలనే ధర్మాన్ని సీఎం కేసీసార్ నేర్పించారని మంత్రి తలసాని అన్నారు. నగరంలో రోడ్డు కనెక్టివిటీ చాలా పెరిగిందన్నారు.
కూకట్పల్లి నుంచి బాలానగర్, బోయినపల్లి వెళ్లే వారికి, ఫతేనగర్ నుంచి బల్కంపేట వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు చూసేవారని, అదేవిధంగా చింతల్.. కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చే వారు కూడా ఎన్నో కష్టాలు పడేవారన్నారు. కానీ ఇప్పుడు అద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మాణం తో ఆ కష్టాలన్నీ పోయాయన్నారు. అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, అద్భుతమైన గార్డెన్స్, నాలా అభివృద్ధి పనులు ఇవన్నీ మంత్రి కేటీఆర్ ఆలోచనతోనే ఈ అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా సమయంలో ఉన్నతవర్గాల వాళ్లు కూడా చికిత్స కోసం గాంధీకి వచ్చిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు.
టీఎస్పీఎస్సీ ద్వారా ఒకేసారి 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌దని, ఏ శాఖలో కూడా ఖాళీలు ఉండొద్దని సీఎం తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ వచ్చి కాళ్లు మొక్కుతారని, పని చేయని వాళ్లు మనకు అవసరంలేదన్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న రూ.2వేల పింఛనుతో వృద్ధులు నిన్నటివరకు కోడళ్ల చీత్కారాలకు గురయ్యేవారని, ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు మహేశ్వరి, ముద్దం నర్సింహాయాదవ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, స్థానిక నాయకులు శ్రీహరి, సురేశ్‌యాదవ్, శేఖర్ ముదిరాజ్, నరేందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మహ్మద్ అఖిల్ అహ్మద్, యాదగిరిగౌడ్, సీ సత్యనారాయణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్ మే 9: కూకట్పల్లి నియోజవర్గంలోని బేగంపేట్ డివిజన్లో సుమారు 24 వరకు బస్తీలు, కాలనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి సరైన చోటు ఉండేది కాదు. బేగంపేట్‌కు ఆనుకోని పాత ఎయిర్పోర్ట్ పక్కన కొంత స్థలంలో స్థానికులు చనిపోతే ఆ స్థలంలో అంత్యక్రియలు చేసేవారు. అక్కడ నిలువ నీడ లేకపోగా అంత్యక్రియలు చేపట్టడానిక కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఇలా కొంత కాలం గడిచాక బేగంపేట్ డివిజన్‌కు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు అప్పటి ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అక్కడ స్థలం తక్కుగా ఉంది దాని పక్కనే ఎయిర్పోర్ట్, మరో పక్కన హైదరాబాద్ పబ్లిక్ స్థలం ఉంది. కావున అక్కడ మనం అభివృద్ది ఏమీ చేయలేమని చెతులెత్తేశారు. దీంతో 40 ఏండ్లుగా స్థానికులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఇక వారు శ్మశాన వాటికలో వసతులు అభివృద్ధి గురించి మర్చిపోయారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తేదేపా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపొందారు. అనంతరం కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడైన ఎమ్మెల్యే మాధవరం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. చేరిన కొద్ది రోజులకే నియోజవర్గంలోని అన్ని డివిజన్లలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలు విన్న తర్వాత ధనియాలగుట్ట శ్మశాన వాటిక మీదుగా కూకట్‌పల్లికి వెళ్తున్న ఎమ్మెల్యేకు శ్మశాన వాటిక వద్దకు రాగానే అక్కడ కొంత మంది మహిళలు బహిరంగంగ స్నానాలు చేయడం గమనించాడు. దీంతో ఎమ్మెల్యే చలించిపోయారు. ఈ కాలంలో కూడా ఇలా బహిరంగంగా స్నానాలు చేయడం ఏంటని మరో సారి స్థానికులు, స్థానిక నాయకులతో చర్చించారు.40 ఏండ్లుగా వాళ్లు పడుతున్న ప్రజల బాధలకు శ్మశాన వాటిక నిర్మించి సమస్యలకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొంత స్థలమే ఉంది. దీని పక్కనే ఉన్న మరికొంత స్థలం సేకరించి అభివృద్ధి చేస్తానని స్థానికులకు మాట ఇచ్చాడు.
పనులు మొదలు పెట్టించాడు. ఈక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ, పక్కనే ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కమిటీ సభ్యులు అక్కడ జరిగే అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేశారు. దీంతో మరింత పట్టుదలతో ముందుకు వెళ్లి అక్కడి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి ఎమ్మెల్యే తీసుకవెళ్లాడు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అక్కడి స్థలం పూర్తిగా సర్వే చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం తాను దగ్గరుండి స్థల సేకరణ పనులు చేపట్టారు. హెచ్‌పీఎస్ వారు ఈ క్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ పట్టువదల కుండా ప్రభుత్వ స్థలమని రుజువు చేయించారు. దీంతో రెండు ఎకరాలు ఉన్న స్థలం కాస్త నాలుగు ఎకరాలైంది. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి దీని అభివృద్ధి కోసం అప్పట్లో రెండు కోట్లు మంజూరు చేయించారు. ఆ నిధులతో కొంత వరకు అభివృద్ధి చేసి స్థానికులతో అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై హెచ్‌పీఎస్ యాజమాన్యం కేసులు కూడా నమోదు చేయించింది. వాటికి బయపడకుండా ఎమ్మెల్యే దగ్గరుండి అభివృద్ధి పనులు చేయించారు. దీంతో ఎమ్మెల్యే ధైర్యానికి ఫిదా అయిన స్థానిక వివిధ పార్టీల నాయకులు ఏకమై ఎమ్మెల్యేకు అండగా నిలిచారు. దీంతో అక్కడ నాలుగు ఎకరాల స్థలంలో శ్మశాన వాటిక అభివృద్ధిని చేపట్టారు. కొంత కాలం తర్వాత మరింత అభివృద్ధి చేయాలని అలోచించి 9 కోట్లు మంజూరు చేయించి అద్భుతమైన రీతిలో వైకుంఠధామాన్ని నిర్మించి అందరి మన్ననలు పొందారు.