సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు నగరంలోని శంషాబాద్‌లో అత్యధికంగా 2.55సెం.మీలు, బడంగ్‌పేటలో 1.65సెం.మీలు, ఆదిభట్లలో 1.48సెం.మీ లు, హయత్‌నగర్‌లో 1.05సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మాన్సూన్ ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.