సుల్తాన్ బజార్, జూన్ 25. మాజీ సీఎం కేసీఆర్ కలలో కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. బుధవారం అబిడ్స్‌లోని జీపీఓ ప్రధాన కార్యాలయం వద్ద వితంతువులు, వృద్ధులు, వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. పోస్ట్‌కార్డు, ప్లకార్డులతో ర్యాలీగా బయలుదేరి జీపీఓ పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌కార్డులను వేసిన అనంతరం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ..
రేవంత్ రెడ్డి హుందాగా నడుచుకోవాలన్నారు. చంద్రబాబును ప్రజాభావన్కు పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి మరీ గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4వేలు, మహిళలకు రూ.2,500, వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్థానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆమె అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.