హైదరాబాద్ : కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం నుంచి బతుకమ్మలతో ఊరేగింపుగా.. ఐడీఎల్ లేక్ వద్దకు చేరుకున్నారు.
శేషాద్రి నగర్లో స్థానిక మహిళల ఆహ్వానం మేరకు కవిత బతుకమ్మ ఆడి పాడారు. హనుమాన్ ఆలయం వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, స్థానిక మహిళల్లో ఉత్సాహం నింపారు. హనుమాన్ ఆలయం నుంచి ఐడీఎల్ లేక్ వరకు భారీ బతుకమ్మలతో కవిత ర్యాలీగా వచ్చారు. 30 ఫీట్ల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐడీఎల్ లేక్ దగ్గర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి గంగమ్మకు పూజలు చేసి బతుకమ్మను కవిత నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగేందుకు యువతులు, మహిళలు ఆసక్తి చూపారు. మార్వాడీ యువతులు, మహిళలతో కలిసి గర్భా డ్యాన్స్ చేశారు కవిత. భారతీయ సంప్రదాయ నృత్యాలను ఎమ్మెల్సీ వీక్షించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.