జగద్గిరిగుట్ట, మే11: పోక్సో కేసులో నిందితుడిపై సరైన విచారణ జరగాలంటే కేంద్రమంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై కేసు నమోదై మూడు రోజులైనా అరెస్ట్ చేయక పోవడాన్ని తప్పుబట్టారు. హోం శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యవస్థను నియంత్రిస్తూ కేసు నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.
బండిసంజయ్ రాజకీయ ప్రస్థానం, చరిత్ర ప్రజలందరికి తెలుసన్నారు. గంగుల కమలాకర్ చేతిలో మూడుసార్లు ఓటమి పాలుకావడం, 2018కి ముందు రాజకీయ భవిష్యత్ కోసం భిక్షాటన, చందాల సేకరణ నుంచి కోట్లకు ఎలా చేరారని ప్రశ్నించారు. సొంత బలం లేక రామందిరం, ధర్మం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు, రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందాలు కాదు రాజీనామాచేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బాలికపై హనీట్రాప్ కేసు వర్తించదని, పోక్సో కేసు నీరుగార్చేందుకే నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని దుయ్యబట్టారు.
మేం కలిసి తిరిగామని బండి కుమారుడే ఒప్పుకోవడం, లైంగికదాడి బాధితురాలికి న్యా యం జరగాలంటే బండి పదవినుంచి తప్పుకోవాల్సిందేని డిమాండ్ చేశారు.బాలిక తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడంపై ఆధారాలున్నాయని, బండిసంజయ్ని బర్తరఫ్ చేసి ఎఫ్ఐఆర్లో పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ నాటకాలాడుతూ ఢిల్లీ లో కుస్తీ, గళ్లీలో దోస్తీ తీరును త్వరలోనే బయటపెడుతామన్నారు.