బేగంపేట్/బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 6: సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువలేనని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. భారీ మెజార్టీతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సనత్‌నగర్ సెవన్ టెంపుల్, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, పీజీ రోడ్డులోని హనుమాన్ దేవాలయానికి చెందిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు శ్రీనివాస్‌యాదవ్‌కు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదా లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, వివిధ వర్గాల వారికి రుణపడి ఉంటానన్నారు. జలమండలి సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎం శశాంక్‌తో పాటు మేనేజర్లు, అలాగే జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్‌తో పాటు ఏఈలు తలసానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనరల్ బజార్‌కు చెందిన బెంగాలీ గోల్డ్‌స్మిత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహమత్ అలీ, హబీబ్ హల్దార్, జాకీర్ హుస్సేన్, జోసిమ్ మోలిక్ ఎమ్మెల్యే తలసానికి శుభాకాంక్షలు తెలిపారు.