అమీర్‌పేట్, జనవరి 2 : సనత్‌నగర్(Sanathnagar) నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల నిధులు వెచ్చించి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. సనత్‌నగర్ డివిజన్ మార్కెట్ రోడ్డులోని శ్రీనివాస్ భవన్ నుంచి హిందూ పబ్లిక్ స్కూల్ వరకు రూ. 65 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తలసాని గురువారం శంకుస్థాపన చేశారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్, రహదారుల వ్యవస్థలను ఆధునీకరించామని వెల్లడించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో పాటు జీహెచ్ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ వాసుదేవరెడ్డి, ఏఎంవోహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, జలమండలి జీఎం హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, సురేష్‌గౌడ్, దాడి ప్రవీణ్‌రెడ్డి, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.