హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీక అని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆగస్టు 2 వ తేదీన సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి బోనాల విశిష్టతను పెంచిందని గుర్తు చేశారు. అంతేకాకుండా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో దేవాలయాలకు కేసీఆర్ ప్రభుత్వమే మొట్టమొదట నిధులు ఇచ్చిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట జోనల్ కమిషనర్ మంగ తాయారు, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఏఈ చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు కిశోర్, సతీష్, కోటేశ్వర్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, గణేష్, జనార్దన్, రాజు, చంద్ర ప్రకాష్, అరుణ్ భట్, జయరాజ్, సత్యనారాయణ, డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, పలు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు తదితరులు ఉన్నారు.