అమీర్పేట ఏప్రిల్ 1: మండు వేసవిలో అన్నార్తుల ఆకలి తీర్చడం మహా పుణ్యకార్యమని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్ఆర్ నగర్లోని శ్రీ శ్రీనివాస సమాజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న మిత భోజన శిబిరాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఆర్ఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన తరువాత సమాజం పట్ల తన బాధ్యతలను కొనసాగిస్తున్న డి పార్థసారథి సేవలు అభినందనీయులన్నారు. గత 15 సంవత్సరాలుగా ఎస్ఆర్ నగర్ లో కొనసాగుతున్న మధ్యాహ్న మిత భోజన ఉచిత శిబిరాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ, ఎనిమిది పదులు దాటుతున్న వయసులో కూడా సామాజిక బాధ్యతల నిర్వహణలో ఇప్పటికీ ఉత్సాహంగా ఉరకలేస్తుండడం ఇక్కడి వయోదికుల్లోనే చూస్తున్నామన్నారు.
సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న పార్థసారథి తన వయోభారం విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలని ట్రస్టు ప్రతినిధులకు ఎమ్మెల్యే తలసాని సూచించారు. నేటి నుంచి జూన్ రెండవ తేదీ వరకు నిరాటంకంగా కొనసాగనున్న ఉచిత మధ్యాహ్న మిత భోజనం శిబిరానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్. శేషు కుమారి తో పాటు సనత్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, దాడి ప్రవీణ్ రెడ్డి, బీఆర్ నారాయణ రాజు, కూతురు నరసింహ పాల్గొన్నారు.