హైదరాబాద్ : మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అధికారులను ఆదేశించారు. బుధవారం వెస్ట్‌మారేడ్ పల్లలోని తన నివాసంలో ఈ నెల 21న జరిగే సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి(Ujjain Mahankali) అమ్మవారి జాతర, బోనాల(Bonala festivals) ఉత్సవాలు, 22 వ తేదీన నిర్వహించే రంగం కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో తనవంతు సహకారం ఉంటుందని చెప్పారు. అలాగే ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర, బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆహ్వానించారు.