ఎల్బీనగర్, జూలై 18 : వరదనీటి ట్రంక్‌లైన్ పనుల్లో వేగం పెంచాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సాగర్ రింగ్‌రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న వరదనీటి ట్రంక్ లైన్ పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో వరదనీటిలో ఇబ్బందులుపడుతున్న కాలనీల వాసులకు ట్రంక్ లైన్ నిర్మాణంతో సమస్య తీరిపోతుందన్నారు. ట్రంక్ లైన్ నిర్మాణం కోసం గతంలో రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఆ నిధులు సరిపోక పోవడంతో మరికొన్ని నిధులను మంజూరు చేయించామన్నారు.
ఈ ట్రంక్‌లైన్ సకాలంలో పూర్తయితే క్రిష్టియన్ కాలనీ, రాజిరెడ్డి కాలనీ, హస్తినాపురం ఈస్ట్, న్యూ వెంకటరమణ కాలనీ, శ్రీ వెంకటరమణ కాలనీ, అనురాధ కాలనీ, ఓంకార్నగర్తో పాటుగా పలు కాలనీలవాసులకు వరదనీటి సమస్యలతో పూర్తిస్థాయిలో విముక్తి లభిస్తుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య లన్నీంటినీ ప్రణాళికాబద్దంగా పరిష్కారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యంచారి, రవి ముదిరాజ్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, చాతిరి మధుసాగర్ తదితరులు పాల్గొన్నారు.